తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో లీకుల బాగోతం…లక్షలాది ఉద్యోగ అభ్యర్థుల భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేసింది. నిరుద్యోగుల జీవితాల్లో ప్రకంపనలు రేపిన పేపర్ లీకేజ్ వ్యవహారం తెలంగాణలో అగ్గిరాజేసింది. TSPSC పేపర్ లీక్ వ్యవహారం తెలంగాణ సర్కార్‌ను కుదిపేస్తోంది. పేపర్ల లీక్‌లో తవ్వే కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. టీఎస్పీఎస్సీ నిర్లక్ష్యంతో మరిన్ని ఎగ్జామ్ పేపర్లు బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. అటు.. పేపర్ లీక్ కేసును సిట్‌కు బదిలీ చేస్తూ.. హైదరాబాద్ సీపీ CV ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా పేపర్ లీక్ వ్యవహారంపై టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ జనార్దన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ‘గ్రూప్ 1 పరీక్ష నిర్వహణ పై అందరూ ప్రశంసించారు. పారదర్శకంగా నియామకాల ప్రక్రియలో ఎలాంటి రాజీ లేదు . ఏడాది లో మొత్తం 27 నోటిఫికేషన్లు ఇచ్చాం. ఇప్పటికే 7 ఎగ్జామ్స్ పూర్తి అయ్యాయి. ఈ నెల 11వ తేదీన డేటా బయటికి వెళ్లినట్లు మా దృష్టికి వచ్చింది. దీనిపై పోలీసులకు వెంటనే ఫిర్యాదు చేశాం. రాజశేఖర్ రెడ్డి అని నెట్‌వర్క్ ఎక్స్ పర్ట్ ఏడేళ్లుగా ఇక్కడ పని చేస్తున్నాడు. అతని నైపుణ్యంతో ఇతర కంప్యూటర్ ల డేటా యాక్సిస్ చేసినట్లు తెలిసింది. ప్రవీణ్ అనే మరో ఉద్యోగితో కలిసి పేపర్ లీకేజీ చేశారు. పోలీసుల నుంచి అఫిషియల్ రిపోర్ట్ వచ్చాకే తుది నిర్ణయం తీసుకుంటాం’
ప్రవీణ్ పేపర్ హ్యాక్ చేసినట్లు గుర్తించాం. అతను ప్రశ్నాపత్రాన్ని పది లక్షలకు అమ్ముకున్నాడు. దీనిపై రేపు 3గంటలకు అధికారిక నివేదిక అందుతుంది. ఆ నివేదిక ఆధారంగా AE పరీక్ష రద్దు చేయాలా వద్దా అని నిర్ణయిస్తాం. ప్రవీణ్, రాజశేఖర్ కలిసి పేపర్ లీక్ చేశారు. దర్యాప్తు నివేదిక వచ్చాక, న్యాయ నిపుణులతో మాట్లాడి రద్దుపై నిర్ణయం తీసుకుంటాం’ అని జనార్ధన్ రెడ్డి పేర్కొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..