Summer Heat In Telangana
Telangana: తెలంగాణాలో రోజు రోజుకీ భానుడు భగభగమంటున్నాడు. ఎండలు (Summer Heat) మండిస్తున్నాయి. ఎండ తీవ్రతకు రోడ్ల మీద జనాలు కనిపించడం తగ్గిపోయింది. ఈసారి ఎండలు గత సంవత్సరం కంటే తొందరగా మొదలయ్యాయి. దీంతో ఇప్పుడే ఈ స్థాయి లో ఎండలు మండిస్తుంటే.. పలు ప్రాంతాల్లో రేపటి నుంచి ఎండలతో పాటు తీవ్ర వడగాలులు(Heat Waves) కూడా వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నాలుగు రోజుల పాటు సాధారణ ఉష్ణోగ్రతల(temperature) కంటే అధికంగా ఎండల తీవ్రత ఉండనుందని.. అదనంగా 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని.. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. అత్యవసరం అయితే తప్ప.. బయటకు రావద్దని సూచించింది. ఈ మేరకు ఆరెంజ్ అలెర్ట్ ను జారీ చేసింది. ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. తెలంగాణా సీఎస్ సోమేశ్ కుమార్.. అన్ని జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. అధికారులు, వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
- ముందస్తు ఏర్పాట్లు: రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉపకేంద్రాలు, ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బందిని అప్రమత్తం చేయాలనీ, సరిపడా ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సిఎస్ సోమేశ్ కుమార్ సూచించారు. వేసవి తాపం, వడగాల్పుల వలన ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని స్కూల్స్ లో పని సమయాన్ని తగ్గిస్తూ.. ఆదేశాలు జారీ చేశారు. ఇక ఉపాధి కూలీలు పనులు చేయకుండా తగిన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. అంతేకాదు.. అగ్నిమాపక శాఖ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.
- ఆరోగ్య శాఖ: ఇప్పటికే అధిక ఎండలు, గాలుల వలన ప్రజలు తీవ్ర ఉక్కబోతతో ఇబ్బంది పడుతున్నారు. వేసవిలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపధ్యంలో మరోవైపు ఆరోగ్య శాఖ కూడా ముందస్తు చర్యలను చేపట్టింది. జిల్లాలోని వైద్య అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పారు. అత్యవసర చికిత్యా బృందాలను అప్రమత్తం చేయాలని సూచిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
- రికార్డ్ స్థాయిలో: మరోవైపు తెలంగాణాలో పొడిగాలులు వీస్తున్నాయి. దీంతో సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. మార్చి నెలలో ఎన్నడూ లేనంతగా భానుడు భగభగమంటున్నాడు. కుమరం భీం జిల్లాలోని కెరమెరి గ్రామంలో అత్యధిక ఉష్ణోగ్రత 43.9 డిగ్రీలు నమోదైంది. గత పదేళ్లలో మార్చి నెలలో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత రికార్డని తెలుస్తోంది. ఇక ఏప్రిల్ నెలలో ఈ ఉష్ణోగ్రతలు మరింత పెరిగి.. 44 డిగ్రీలు దాటనున్నదని అంచనా వేస్తున్నారు.
- అల్లాడుతున్న ప్రజలు: ఎండల తీవ్రతకు జనం బెంబేలెత్తుతున్నారు. ఉష్ణోగ్రతలతోపాటు వడగాల్పులు తీవ్రత ఎక్కువగా ఉండడంతో జనం అల్లాడుతున్నారు. రోజు రోజుకీ ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తుంది. దీంతో అధికారులు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అత్యవసరం ఉంటే తప్ప బయటకు రావద్దని సూచిస్తున్నారు
Also Read: Telangana: ముగిసిన జాతీయ సాంస్కృతిక మహోత్సవాలు.. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి జిల్లాలోనూ ఏర్పాటు చేయాలని విజయశాంతి విజ్ఞప్తి
Gold And Silver Price Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. వరసగా మూడో రోజు దిగివచ్చిన బంగారం ధర, స్థిరంగా వెండి