High Court on Telangana Govt. తెలంగాణలో కరోనా కట్టడికి చర్యలు, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ నివేదికపై అసంతృప్తి వ్యక్తం చేసింది రాష్ట్ర హైకోర్టు. తాము ఇచ్చిన ఆదేశాలు చాలా వరకు పాటించడంలేదని అధికారుల తీరును కోర్టు తప్పుబట్టింది. కరోనా చికిత్స ధరలపై కొత్త జీవో ఎందుకు ఇవ్వలేదని, సలహా కమిటీ ఎందుకు ఏర్పాటు చేయలేదని నిలదీసింది. పైగా మూడో దశ సన్నద్ధతపై ఇచ్చిన వివరాలు సమగ్రంగా లేవని అసహనం వ్యక్తం చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో చిల్లల కోసం నీలోఫర్ ఆస్పత్రి ఒక్కటే సరిపోతుందా అని ప్రశ్నించింది. రాష్ట్ర కరోనా పరిస్థితులపై ప్రధాన న్యాయమూర్తి హిమా కోహ్లీ, జస్టిస్ విజయసేన్ రెడ్డిల కూడిన ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో ధర్మాసనం ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించింది.
మరోవైపు లైసెన్స్‌లు రద్దు చేసిన ఆస్పత్రుల్లో బాధితులు చెల్లించిన సొమ్మును తిరిగి ఇచ్చారా అని ప్రశ్నించింది హైకోర్టు. బంగారు తాకట్టు పెట్టి ఆస్పత్రులకు ఫీజులు చెల్లిస్తున్నారని గుర్తు చేసింది. ఇంకోవైపు, కేటాయించిన బ్లాక్ ఫంగస్ ఔషధాలను ఎందుకు సరఫరా చేయలేదో తెలపాలని కేంద్రాన్ని ఆదేశించింది హైకోర్టు. అలాగే, కొత్త ఏర్పాటు చేసిన ఆర్టీపీసీఆర్ ల్యాబ్‌లు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయని కోర్టు ప్రశ్నించింది. మహారాష్ట్రలో కరోనా బారినపడి 8 వేల మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేసిన కోర్టు చిన్న పిల్లల సంరక్షణకు మరిన్ని ఆసుపత్రులను అందుబాటులోకి తీసుకురావాలని పేర్కొంది. కాగా, ఈ విచారణను రేపటికి వాయిదా వేసింది హైకోర్టు ధర్మాసనం.