TS Rains: ఆకాశానికి చిల్లుపడ్డట్టే..! ఏడాదంతా కురవాల్సిన వాన ఒక్కరోజులోనే.. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి

ఏడాదంతా కురవాల్సిన వాన ఒక్కరోజులోనే కురిసింది. ఆకాశానికి చిల్లుపడ్డట్టు, కడవలో నీళ్లు గుమ్మరించినట్టు ఏకధారగా కుంభవృష్టి వర్షం కురిసింది. గడిచిన 24 గంటల్లో (గురువారం) ములుగు జిల్లా వెంకటాపురం మండలం లక్ష్మీదేవిపేటలో..

TS Rains: ఆకాశానికి చిల్లుపడ్డట్టే..! ఏడాదంతా కురవాల్సిన వాన ఒక్కరోజులోనే.. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి
TS Heavy Rains

Updated on: Jul 28, 2023 | 8:15 AM

ములుగు, జులై 28: ఏడాదంతా కురవాల్సిన వాన ఒక్కరోజులోనే కురిసింది. ఆకాశానికి చిల్లుపడ్డట్టు, కడవలో నీళ్లు గుమ్మరించినట్టు ఏకధారగా కుంభవృష్టి వర్షం కురిసింది. గడిచిన 24 గంటల్లో (గురువారం) ములుగు జిల్లా వెంకటాపురం మండలం లక్ష్మీదేవిపేటలో 64.98 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఫలితంగా జన జీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి లక్ష్మీదేవిపేటలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైనట్టు వాతావరణశాఖ స్పష్టం చేసింది. ఇప్పటివరకు ఇదే అత్యధిక వర్షపాతమని వెల్లడించింది. గతంలో 2013 జూలై 19న వాజేడులో 51.75 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత లక్ష్మీదేవిపేటలో కుంభవృష్టి వాన కురిసిందిజ

కాగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోని 35 ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల వర్షపాతం వర్షం కురిసింది. 200 కేంద్రాల్లో 10 సెంటీమీటర్లకుపైగా వర్షపాతం నమోదైంది. హైదరాబాద్‌లో గత 6 గంటల్లో 60 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ రోజు నగరంలో 30 నుంచి 40 మిల్లీమీటర్ల వరకు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. నేడు రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.

మరోవైపు ఈ సీజన్‌లో ఇప్పటి వరకూ 60 శాతం అత్యధిక వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. జూన్‌ 1 నుంచి 321.1 మి.మీ నమోదు కావాల్సి ఉంది. ఐతే ఇప్పటి వరకు దాదాపు 513.4 మి.మీ వర్షపాతం నమోదైంది. అంటే సగటు సాధారణ వర్షపాతం కంటే ఇది 60 శాతం అధికమని పేర్కొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us