తెలుగు రాష్ట్రాల్లో సోమవారం (ఏప్రిల్ 3) నుంచి పదో తరగతి పబ్లిక పరీక్షలు-2023 ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఐతే తొలిరోజు పరీక్ష ప్రారంభమైన 7 నిముషాలకే తెలంగాణలోని వికారాబాద్ జిల్లా తాండూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల-1లోని 5వ నంబర్ పరీక్ష హాల్ నుంచి ఫస్ట్ లాంగ్వేజ్ ప్రశ్నపత్రం వాట్సప్‌లో ప్రత్యక్షమైంది. ఇన్విజిలేటర్ క్వశ్చన్ పేపర్ ఫొటోలు తీసి వాట్సాప్ ద్వారా మరో పాఠశాలలోని టీచర్‌కు పంపాడు. అతను ఇతర గ్రూపులకు పంపడంతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పోలీసుల విచారణలో తాండూరు-1 స్కూల్ నుంచి పేపర్ లీకైనట్లు గుర్తించారు. ఇక ఈ రోజు పదో తరగతి సెకెండ్ లాంగ్వేజ్ పరీక్ష జరగనుంది. నిన్న తాండూర్‌లో పరీక్ష పేపర్ బయటికి రావడంతో మరింత అప్రమత్తంగా నేటి పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ మేరకు విద్యాశాఖ డీఈవో, ఎంఈవోలకు అదనపు ఆదేశాలు జారీ చేసింది. మాల్ ప్రాక్టీస్, పేపర్ లీకేజీ వంటి జరిగితే వారిదే బాధ్యత అంటూ హెచ్చరికలు జారీ చేసింది. జిల్లా, మండల అధికారులను సైతం బాధ్యులవుతారని పేర్కొంది. ఎలాంటి అవాంచనీయ, మాల్ ప్రాక్టీస్ ఘటనలు జరగకుండా చూడాలని ఆదేశించింది. నిన్న జరిగింది పేపర్ లీకేజీ కాదని.. మాల్ ప్రాక్టీస్ ప్రయత్నమని ఉన్నతాధికారులు వివరణ ఇచ్చారు. పరీక్ష ప్రారంభం అయిన తర్వాత పేపర్ బయటకొచ్చిందనీ.. చిట్టిలు తయారు చేయడం కోసం పంపి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. నిన్న ఒక్క మాల్ ప్రాక్టీస్ కేసు కూడా నమోదు కాలేదని, మొదటి రోజు పరీక్షకు 79 శాతం విద్యార్ధులు హాజరయ్యారని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు వివరించారు. ఈ నేపథ్యంలో అధికారుల నిర్లక్ష్యం మూలంగా సెల్ ఫోన్ అనుమతి లేకున్నా ఇన్విజిలేటర్ ఫోన్ తేవడంలో పరీక్ష కేంద్రాల్లో అధికారులు ఎల్ సెక్యూరిటీ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందనే విమర్శలు వెల్లువెత్తున్నాయి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.