రంగారెడ్డి జిల్లా శేర్ లింగంపల్లి మండలం గోపన్ పల్లి గ్రామంలో.. రేవంత్ రెడ్డి బ్రదర్స్ భూ ఆక్రమణల బాగోతం ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. కోట్ల రూపాయల విలువైన భూములను రేవంత్ రెడ్డి ఆక్రమించినట్లు రెవెన్యూ అధికారులు తేల్చారు. RDO చంద్రకళ విచారణలో రేవంత్ రెడ్డి భూకబ్జాల బాగోతాలు వెలుగుచూస్తున్నాయి. రేవంత్ రెడ్డి భూకబ్జాల బాగోతంపై.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ సంచలన ఆరోపణలు చేశారు. గోపన్‌పల్లిలో రేవంత్ రెడ్డి సోదరులు దళితుల భూములను లాక్కున్నారని సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు.. తాను చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి.. రేవంత్ రెడ్డి కొత్త ఫోజులు కొడుతున్నారన్నారు. వాల్టా చట్టాన్ని సైతం ఉల్లంఘించారని.. అందరూ తనలాగే తప్పులు చేస్తారని రేవంత్ అనుకుంటారన్నారు.
రేవంత్ వ్యాఖ్యలు చూస్తుంటే.. దొంగే దొంగ.. దొంగ అని అరిచినట్లుగా రేవంత్ వ్యవహరిస్తున్నారన్నారు. ఆయన బతుకంతా బ్లాక్‌మెయిలింగేనని.. ఓ పెద్ద భూకబ్జాకోరుగా మారారని ఆరోపించారు. పేద ప్రజల భూములను లాక్కోవడమే కాకుండా.. వారికి కనీసం క్షమాపణలు చెప్పకుండా.. మళ్లీ ఆరోపణలు చేశారన్నారు.
2014 ఎన్నికల అఫిడవిట్‌లోనే 8ఎకరాల 9 గుంటల స్థలాన్ని కేటీఆర్ చూపించారన్నారు. ఫామ్ హౌస్‌కి ఈ స్థలానికి సంబంధం లేదని.. శంకర్‌పల్లిలో ఫాంహౌస్ కేటీఆర్ లీజుకు తీసుకున్నారని.. అంతేకాదు లీజ్ అగ్రిమెంట్ ప్రకారం డబ్బులు కూడా చెల్లిస్తున్నారన్నారు. బట్టకాల్చి మీద వేసే ప్రయత్నమే రేవంత్ రెడ్డి చేస్తున్నారని ఆరోపంచారు. ఇప్పటి వరకు తనపై వచ్చిన ఆరోపణలపై కనీసం వివరణ కూడా ఇవ్వలేదన్నారు.