తెలంగాణ మంత్రి మల్లారెడ్డి(Malla Reddy)పై దాడికి ప్రయత్నించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ టీఆర్ఎస్(TRS) నేతలు సోమవారం నాడు ఘట్కేసర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తాజాగా ఈ రోజు మల్లారెడ్డిపై దాడి ఘటనలో మరో కేసు నమోదు చేశారు. మొత్తం 16 మందిపై 6 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సెక్షన్ 173, 147,149,341, 352, 506 కింద కేసులు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ లో కాంగ్రెస్ నేతలు సోమశేఖర్ రెడ్డి, హరివర్థన్ రెడ్డిపై కేసులు పెట్టారు. కొంత మంది పక్కా ప్లాన్ ప్రకారమే మంత్రిపై దాడి చేయించారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. దాడి వెనక కాంగ్రెస్ నేతల హస్తం ఉందని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తూ కేసు పెట్టారు. సభ నుంచి తిరిగి వెళ్లిపోతున్న సమయంలో మల్లారెడ్డిపై వాటర్ బాటిళ్లు, కుర్చీలతో కొంతమంది దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. రెడ్డి సభలో కాంగ్రెస్ నేతలు ప్లెక్సీలు పెట్టి, ఇతర ప్రాంతాల నుంచి కొంతమంది ఆకతాయిలను తీసుకువచ్చి దాడి చేయించారని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.
ఈ నెల 29న ఘట్ కేసర్‌లో జరిగిన రెడ్ల సింహాగర్జన కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. మంత్రి మల్లారెడ్డి ప్రసంగిస్తున్న సమయంలో కొందరు ఆయన ప్రసంగానికి అడ్డు తగిలారు. ఆ తర్వాత ఆయన సభ నుంచి వెళ్లిపోతున్న సమయంలో కొందరు మంత్రి మల్లారెడ్డి కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు.
మంత్రి మల్లారెడ్డిపై దాడికి ప్రయత్నించారు. అయితే పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించడంతో మంత్రి మల్లారెడ్డి ఈ దాడి నుండి తప్పించుకున్నారు. మంత్రి మల్లారెడ్డి కాన్వాయ్ పై చెప్పులు, కుర్చీలు విసిరారు. ఈ ఘటనపై మంత్రి మల్లారెడ్డి కూడా సీరియస్ కామెంట్స్ చేశారు. తనను హత్య చేసేందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కుట్ర చేశారని ఆరోపించారు. ఘట్‌కసర్‌లో తనపై దాడికి ప్రయత్నించింది రేవంత్ రెడ్డి అనుచరులేనని ఆయన ఆరోపించారు.