TRS Leader Kadiyam Srihari Hot comments: తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. కృష్ణా, గోదావరి నదీ జలాల యాజమాన్యపు బోర్డుకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి గొడ్డలి పెట్టు అన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ని అడ్డుకునే కుట్రలో భాగమే గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిందన్నారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలంగాణ ప్రజల నెత్తిపై చేయి పెట్టబోయి ఏపి ప్రజల నెత్తిపైన చేయి పెట్టారని ఎద్దేవా చేశారు. నదీ జలాల సమాన పంపిణీ పేరుతో రెండు తెలుగు రాష్ట్రాలు నిర్మిస్తున్న ప్రాజెక్టులను కేంద్రం హస్తగతం చేసుకుందన్నా ఆరోపించారు.
కొత్తగా కేంద్ర తీసుకువచ్చిన గెజిట్ వల్ల ఏపీ తెలంగాణ ప్రాజెక్టులను మాత్రమే కేంద్రం అజమాయిషీ చేస్తుందన్నారు. గోదావరి నది జలాల పంపిణి పై ఎలాంటి వివాదాలు లేకున్నా కేంద్రం ఎందుకు ఆధీనంలోకి తీసుకుందో చెప్పాలని కడియం శ్రీహరి ప్రశ్నించారు. రాష్ట్ర విభజన పూర్తై ఏడేళ్లు గడుస్తున్నా ఇంకా కృష్ణ నది జలాల సమస్యలు అలాగే ఉన్నాయని అన్నారు. వాటిని కేంద్రం చర్చల ద్వారా వెంటనే పరిష్కరించాలని ఆయన కోరారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునే గెజిట్‌ను రాష్ట్ర భారతీయ జనతాపార్టీ స్వాగతించడం సిగ్గుచేటు అని కడియం శ్రీహరి అన్నారు. బీజేపీ కాంగ్రెస్ పార్టీలు తెలంగాణ హక్కుల విషయంలో స్పష్టమైన వైఖరి లేదన్న కడియం.. సీఎం కేసీఆర్ ద్వారానే తెలంగాణ హక్కులను కాపాడుకోగలుగుతామన్నారు.