Telangana: ఆ ఇంటిని మృత్యువు ముసిరింది.. ఒకరు వెంట ఒకరు…

అనుమానం అగ్నికుండలా చెలరేగి ఒక కుటుంబాన్ని పూర్తిగా మింగేసింది. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఇద్దరి ప్రాణాలు తీసుకోగా, ఆ బాధను తట్టుకోలేక కుమారుడు కూడా ప్రాణాలు కోల్పోవడం హృదయ విదారకం. వారం రోజుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో సదాశివపేటలో విషాదం అలుముకుంది.

Telangana: ఆ ఇంటిని మృత్యువు ముసిరింది.. ఒకరు వెంట ఒకరు...
Sadashivpet

Edited By:

Updated on: May 05, 2026 | 2:06 PM

ఒకే కుటుంబంలో జరిగిన వరుస మరణాలు స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపాయి. వారం రోజుల వ్యవధిలోనే ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో ఆ కాలనీ శోకసముద్రంలో మునిగిపోయింది. అమ్మానాన్నల మరణాన్ని తట్టుకోలేక వారి కుమారుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే…అనుమానం పెనుభూతమై నిండు ప్రాణాన్ని బలిగొంటే.. ఆ వేదన తట్టుకోలేక మరో ప్రాణం గాలిలో కలిసింది. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపల్ పరిధిలోని సిద్ధాపూర్ కాలనీకి చెందిన రాజు, రాణి దంపతులది సాఫీగా సాగుతున్న సంసారం. అయితే, గత నెల 24న రాత్రి మద్యం మత్తులో ఉన్న రాజు, తన భార్య రాణి అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో గొడవకు దిగాడు. కోపంతో ఊగిపోయిన రాజు, ఇంట్లోని రోకలిబండతో రాణి తలపై బలంగా బాదడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. భార్యను చంపేశానన్న భయంతో రాజు కూడా ఊరి వెలుపల ఉన్న చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు…క్షణికావేశంలో తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయం ఆ ఇంట్లో ఇద్దరు పిల్లలను అనాథలను చేసింది. కుమారుడు మధుకుమార్ (18), కుమార్తె మానసలు తల్లిదండ్రుల మరణంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

ముఖ్యంగా 18 ఏళ్ల మధుకుమార్.. కళ్ళముందే జరిగిన దారుణాన్ని చూసి, తల్లిదండ్రుల జ్ఞాపకాలతో కుమిలిపోయాడు. అప్పటి వరకు అండగా ఉన్న అమ్మానాన్నలు లేరన్న బాధతో శనివారం సదాశివపేట సమీపంలోని ఓ వెంచర్‌లో ఉన్న చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వరుసగా జరిగిన ఈ ఘటనలతో సదాశివపేటలో విషాద ఛాయలు అలముకున్నాయి. తల్లిదండ్రుల క్షణికావేశానికి ఒక నిండు ప్రాణం బలవ్వగా, ఆ వియోగం భరించలేక యువకుడు ప్రాణాలు తీసుకోవడం అందరినీ కలిచివేస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సదాశివపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అమ్మానాన్న, అన్నను కోల్పోయి ఒంటరిగా మిగిలిన చెల్లెలు మానసను చూసి స్థానికులు కన్నీరు మున్నీరవుతున్నారు. అధికారులు ఆమెకు కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన ఆవశ్యకత కనిపిస్తుంది.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి.. 

Follow Us