
అధికారుల చుట్టూ తిరిగినా.. పాలకులను విన్నవించినా వారి కష్టాలు తీరడం లేదు. గిరిజనులకు డోలీ మోత కష్టాలు తప్పడం లేదు. డోలీతో తీసుకొస్తుండగా మార్గం మధ్యలో ఓ గర్భిణి ప్రసవించింది. అడవి తల్లి సాక్షిగా ఓ నిండు గర్భిణీ కారడవిలో ప్రసవ వేదన పడింది. ఆమెను ప్రసవం కోసం ఆరు కిలోమీటర్ల అడవిలో బురద రోడ్డులో ఆదివాసీలు జెట్టీపై మోసుకొచ్చిన ఘటన వెలుగులోకి వచ్చింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని అత్యంత కీకారణ్య బట్టిగూడెం గ్రామానికి చెందిన రవ్వ భీమే అనే నిండు గర్భిణికి పురిటి నొప్పులు వచ్చాయి. మండల కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామానికి దాదాపు 6 కిలోమీటర్ల మేర అసలు రోడ్డు లేదు. వర్షం పడటంతో అడవంతా బురద మయంగా మారింది. అప్పటికే చీకటి పడుతుండటంతో చేసేదేమీ లేక భీమేను ఆసుపత్రికి తరలించాలని నిర్ణయించారు.
ఆదివాసీలు జెట్టి మీదే నానాయాతన పడుతూ రోడ్డు సౌకర్యం ఉన్న తిప్పాపురం వరకు తీసుకుని వచ్చారు. బురద మయమైన రోడ్డుమీద ఓపక్క గర్భిణీ ప్రసవ వేదనతో నరకయాతన అనుభవించింది. బురద రోడ్డులో జెట్టిని మోసుకో రావటానికి ఆదివాసీలు నరకం చూశారు. చివరికి మార్గ మధ్యలో తిప్పాపురంలో రోడ్డు మీదే భీమే ప్రసవించింది. అక్కడి నుంచి ఆటోలో తీసుకొస్తుండగా చెలిమెల వద్దకు రాగానే 108 ఎదురొచ్చింది. దీంతో ఆమెను సత్యనారాయణపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భీమే మగ బిడ్డను ప్రసవించింది.
వీడియో చూడండి..
ఇటీవల వీరాపురం గ్రామానికి చెందిన ఇరమమ్మ అడవిలోని ప్రసవించిన విషయం తెలిసిందే..! మొన్నటికి మొన్న రామచంద్రాపురం గ్రామానికి చెందిన ఆదివాసి గర్భిణీ కట్టం లక్ష్మీని సైతం నానా అవస్థలు పడుతూ ఆదివాసీలు జెట్టిలో మోసుకొచ్చారు. తాజాగా బట్టి గూడెం చెందిన భీమేను జెట్టిలో మోసుకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి, తమ కష్టాలు తీర్చాలని అడవి బిడ్డలు వేడుకుంటున్నారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..