
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో కలకలం రేపిన పశువుల దొంగతనం ఉదంతం ఎట్టకేలకు ముగింపుకు వచ్చింది. గత కొంతకాలంగా ఆదివాసి గ్రామాల్లో, ముఖ్యంగా గోదావరి తీర ప్రాంతాల్లో మేతకు వెళ్తున్న పాడి గేదెలు మాయమవుతుండటంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో, తిమ్మిరిగూడెం గ్రామానికి చెందిన ఆదివాసీలు ధైర్యసాహసాలు ప్రదర్శించి దొంగల ముఠాను పట్టుకున్నారు. లక్షల రూపాయల విలువైన పాడి గేదెలను దొంగిలించి గోదావరి నది గుండా తరలిస్తున్న దొంగలను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని, దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
ప్రస్తుతం తీవ్రమైన వేసవి కాలం నడుస్తోంది. భానుడి భగభగలకు పచ్చిక బయళ్లు ఎండిపోయి పశుగ్రాసం దొరకడం గగనమైపోయింది. పశువులకు తాగడానికి నీళ్లు కూడా దొరకడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో, జీవనాధారం కోసం ఆరుగాలం కష్టపడే ఆదివాసీ రైతులు తమ గేదెలను మేత కోసం, నీటి కోసం గోదావరి నది లంక భూముల్లోకి వదిలేస్తున్నారు. పశువులు రోజంతా అక్కడే ఉండి సాయంత్రానికి ఇళ్లకు చేరుకుంటాయి. అయితే, రైతుల అమాయకత్వాన్ని, లంక ప్రాంతాల నిర్జన వాతావరణాన్ని అదనుగా చేసుకున్న కొందరు దొంగలు పాడి పశువులను మాయం చేయడం మొదలుపెట్టారు.
తిమ్మిరిగూడెం గ్రామానికి చెందిన రైతులు ఎప్పటిలాగే తమ గేదెలను గోదావరి లంకల్లో మేతకు వదిలారు. కానీ, సాయంత్రం అవుతున్నా లక్షల రూపాయల విలువైన ఆ పాడి గేదెలు తిరిగి ఇంటికి చేరలేదు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన గ్రామస్థులంతా కలిసి ఒక బృందంగా ఏర్పడి నదీ పరివాహక ప్రాంతాల్లో వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో ఉమ్మడివరం వద్ద ఉన్న గోదావరి రేవుకు చేరుకునే సరికి అసలు నిజం బయటపడింది. గుంపెనగూడెం గ్రామానికి చెందిన కొందరు దొంగలు తిమ్మిరిగూడెం రైతుల గేదెలను దొంగిలించి, గోదావరి నది మీదుగా అవతలి ఒడ్డుకు దాటించే ప్రయత్నం చేస్తున్నారు.
తమ కష్టాన్ని, జీవనాధారాన్ని దొంగిలిస్తున్న దొంగలను చూడగానే ఆదివాసీ రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. నది ఒడ్డునే ఆ దొంగల ముఠాను చుట్టుముట్టారు. తప్పించుకునే అవకాశం లేకుండా రౌండప్ చేసి మరీ వారికి గట్టిగా దేహశుద్ధి చేశారు. అనంతరం, గేదెలను సురక్షితంగా స్వాధీనం చేసుకుని, దొంగలను చర్ల పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు చర్ల పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి, ఈ ముఠా వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. రైతుల అప్రమత్తతతో లక్షల రూపాయల విలువైన పశువులు దొంగల పాలు కాకుండా మిగిలాయి.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..