Hyderabad: అయ్యో దేవుడా.. చిన్నారి గొంతు కోసిన మాయదారి దారం.. నిమిషాల్లో ఊహకందని విషాదం..

గాలిపటాల సరదా.. ఒక కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. ప్రభుత్వం ఎన్ని హెచ్చరికలు చేసినా, పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా చైనా మాంజా రక్తం చిందిస్తూనే ఉంది. తాజాగా హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఐదేళ్ల చిన్నారి నిష్విక మృతి చెందడం నగరవాసులను ఉలిక్కిపడేలా చేసింది. అసలు ఏం జరిగింది? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

Hyderabad: అయ్యో దేవుడా.. చిన్నారి గొంతు కోసిన మాయదారి దారం.. నిమిషాల్లో ఊహకందని విషాదం..
Kukatpally Girl Death

Updated on: Jan 26, 2026 | 9:51 PM

సంతోషం నిండిన ఆ ఇంట విషాదం నిండింది. అప్పటివరకు తండ్రి ముందు కూర్చుని కేరింతలు కొట్టిన ఆ చిన్నారి.. ఒక్క క్షణంలో విగతజీవిగా మారింది. నిషేధిత చైనా మాంజా రూపంలో మృత్యువు పాశంలా చుట్టుముట్టడంతో ఐదేళ్ల నిష్విక ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. కూకట్‌పల్లి వివేకానందనగర్‌లో జరిగిన ఈ ఘటన నగరాన్ని ఉలిక్కిపడేలా చేసింది. వివేకానందనగర్‌కు చెందిన నిష్విక తన తండ్రితో కలిసి బైక్‌పై వెళ్తోంది. రోడ్డుపై గాలిపటం ఎగురవేస్తున్న ఎవరో గుర్తుతెలియని వ్యక్తి వాడిన చైనా మాంజా గాలికి కొట్టుకొచ్చి అడ్డుగా పడింది. బైక్ వేగంగా వెళ్తుండటంతో ఆ దారం నేరుగా చిన్నారి నిష్విక గొంతుకు చుట్టుకుంది.

ఈ నేపథ్యంలో ఒక్కసారిగా నొప్పి భరించలేక పాప గట్టిగా అరిచింది. కంగారుపడ్డ తండ్రి వెంటనే బైక్ ఆపి చూసేసరికి మాంజా దారం పాప గొంతును లోతుగా కోసేసింది. తీవ్ర రక్తస్రావంతో ఉన్న చిన్నారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే పరిస్థితి విషమించడంతో పాప మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. చైనా మాంజా అనేది సాధారణ నూలు దారం కాదు. ఇది నైలాన్ లేదా సింథటిక్ పదార్థంతో తయారై, దానిపై గాజు ముక్కల పొడిని పూస్తారు. దీనివల్ల ఇది ఎంతటి పదునుగా ఉంటుందంటే.. ఇది పక్షుల రెక్కలనే కాకుండా మనుషుల నరాలను కూడా క్షణాల్లో కోసేస్తుంది. ఇది ప్లాస్టిక్ లాంటి పదార్థం కాబట్టి భూమిలో కలిసిపోదు, తెగిపోయి ఎక్కడైనా చిక్కుకుంటే అది ఏళ్ల తరబడి అలాగే ఉండి ప్రాణాంతకంగా మారుతుంది.

తెలంగాణ ప్రభుత్వం మాంజా అమ్మకాలపై కఠిన నిషేధం విధించాయి. దీన్ని అమ్మినా, వాడినా జైలు శిక్ష, భారీ జరిమానా ఉంటుంది. అయినప్పటికీ కొందరు వ్యాపారులు రహస్యంగా వీటిని విక్రయిస్తూ అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. మీ పిల్లలకు గాలిపటాలు కొనిచ్చేటప్పుడు కేవలం నూలు దారాన్ని మాత్రమే ఎంచుకోండి. ఇలాంటి ప్రమాదాల నుండి తప్పించుకోవడానికి బైక్ హ్యాండిల్స్‌కు రక్షణ గార్డులు అమర్చుకోవడం లేదా గొంతు చుట్టూ మందపాటి స్కార్ఫ్ ధరించడం మంచిది. ఎవరైనా చైనా మాంజా విక్రయిస్తున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..