హైదరాబాద్ నగర శివారులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వనస్థలిపురం ఆటోనగర్‌లో పెను ప్రమాదం తప్పింది. ఆటోనగర్ డీర్‌పార్క్ సమీపంలోని జాతీయ రహదారిపై ఓ లారీలో మంటలు చెలరేగాయి. మంటల ధాటికి లారీ పూర్తిగా దగ్ధమయింది. ఈ ప్రమాదంతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. జేసీబీ సహాయంతో ప్రమాదానికి గురైన లారీని పక్కకు తొలగించారు. ఎక్కడి వాహనాలను అక్కడిగా మళ్లించి ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
అటు ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోనూ పెను ప్రమాదం తప్పింది. సత్తుపల్లిలోని ఓ పెట్రోల్ బంక్ వద్ద బైక్‌లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. బైక్‌లో పెట్రోల్ కొట్టించిన వెంటనే బండిలో నుంచి ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. దాంతో స్థానికులు, వాహనదారులు, పెట్రోల్ బంక్ సిబ్బంది సైతం భయంతో పరుగులు తీశారు. బైక్‌ను వెంటనే పక్కకు తీసి మంటలను అదుపుచేశారు. తక్షణమే స్పందించిన యువకులు చాకచక్యంగా వ్యవహరించి మంటలను అదుపు చేశారు. లేదంటే పెట్రోల్ బంక్‌లో పెను ప్రమాదం సంభవించేది. క్షణాల్లో మంటలు ఆరిపోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి