Telangana: కలెక్టర్ల వాహనాలకు కళ్లెం లేదా..? ప్రజలకు మార్గదర్శిగా ఉండాల్సిన జిల్లా కలెక్టర్లు నిబంధనలు పాటించరా..? అమాయక ప్రజలపై మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించే ఖాకీలకు కలెక్టర్ వాహనాల పెండింగ్ చాలాన్స్ కనిపించడం లేదా..? ఉమ్మడి వరంగల్ జిల్లాలో కలెక్టర్ వాహనాల పెండింగ్ చాలాన్స్ పై టీవీ9 స్పెషల్ ఫోకస్..
రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ చాలాన్స్ వసూళ్లపై స్పెషల్ డ్రైవ్ కొనసాగుతోంది. ఓ చోట జరిమానా పడితే మరోచోట నిలబెట్టి మరి వాహనదారుల జేబులు ఖాళీ చేస్తున్నారు. ఇలా పెండింగ్ చాలన్ల వసూళ్లలో ఖాకీలు ఏ మాత్రం కనికరం చూపడం లేదు. చేతిలో డబ్బు లేకపోతే వాహనాలు సీజ్ చేస్తున్నారు. పెండింగ్ చాలన్ల వసూళ్లలో మరీ కఠినంగా వ్యవహరిస్తున్న వరంగల్ పోలీసులు.. ఆఖరికి కాలేజీ విద్యార్థులను కూడా వదలడం లేదు. కొందరు వాహనదారులు ఆఫీస్‌కి టైం అవుతుందని కాళ్లా వెళ్ళాపడి వేడికున్నా కనికరించకుండా చలాన్స్ వసూళ్లు చేస్తున్నారు. ఈ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా కేవలం ఒక్క వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిదిలోనే రెండు నెలల వ్యవధిలో రెండు కోట్లకు పైగా పెండింగ్ చలాన్స్ వసూలు చేశారు.
సరే వారి వృత్తి ధర్మం.. బాగానే చేస్తున్నారు అనుకుందాం. అయితే.. అందరి పట్ల ఇదే విధంగా వ్యవహరించాలి కదా!. కానీ సామాన్యులకు ఒక న్యాయం.. పెద్ద కార్లలో వెళ్లే వారికి మరో న్యాయమా? ఇప్పుడితే జిల్లాలో పెద్ద చర్చగా మారింది. మ్యాటర్ ఏంటంటే.. జిల్లా కలెక్టర్ల పెండింగ్ చలాన్స్ ఇప్పుడు ప్రజలలో, పోలీస్ డిపార్ట్‌మెంట్ లోనూ తీవ్ర చర్చగా మారాయి. జనగామ జిల్లా కలెక్టర్ వాహనం(TS27A0001)పై 22 చలాన్స్ పెండింగ్ లో ఉన్నాయి. నెలల తరబడి ఈ చలాన్స్ పెండింగ్ లో ఉన్నట్లు ఆన్‌లైన్ లో చూపిస్తోంది. గత ఏడాది నుండి ఈ పెండింగ్ చలాన్లు క్లియర్ చేయలేదు. దీంతో పోలీస్ విభాగానికి జనగామ కలెక్టర్ వాహనం పేరిట 22,000 రూపాయలు బకాయి పడ్డారు.
ఈ ఒక్క కలెక్టర్ వాహనం మాత్రమే కాదు.. దాదాపుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అందరు కలెక్టర్ల వాహనాలదీ ఇదే పరిస్థితి. వరంగల్ జిల్లా కలెక్టర్ వాహనం(TS03EG 0007)పై రెండు చలాన్స్ పెండింగ్‌లో ఉన్నాయి. మరోవైపు హన్మకొండ కలెక్టర్ వాహనం కూడా సేమ్ టూ సేమ్ TS03EG 0001 నెంబర్ గల ఈ వాహనంపై రెండు చలాన్స్ పెండింగ్‌లో వున్నాయి. TS26B0001 నెంబర్ గల ఈ వాహనం మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ యూజ్ చేస్తున్నారు. ఈ వాహనం పై కూడా ఓవర్ స్పీడ్ చలాన్స్ పెండింగ్‌లో ఉన్నాయి.
కేవలం జిల్లా కలెక్టర్ల వాహనాలే కాదు, జాయింట్ కలెక్టర్లు, ఆదనపు కలెక్టర్ల వాహనాలపై కూడా పదుల సంఖ్యలో పెండింగ్ చలాన్స్ ఉన్నాయి. అంతేకాదు జనానికి జరిమానాలు వేస్తున్న పోలీస్ వాహనాలు కూడా స్పీడ్ లిమిట్స్ దాటడంతో జరిమానాలు పడ్డాయి. కానీ వీరెవరూ పెండింగ్ చలాన్స్ కట్టడం లేదు. సామాన్యులను మాత్రం వేదింపులకు గురి చేస్తుండటం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సామాన్యులకు ఒక న్యాయం.. ప్రభుత్వాధికారులకు ఒక న్యాయమా? అంటూ వాహనదారులు నిలదీస్తున్నారు.
Aslo read:
IND vs ENG 4th Test: బ్యాడ్ లైట్ ఎఫెక్ట్.. మూడో రోజు నిలిచిపోయిన ఆట.. భారత్ స్కోర్ 270/3..