
తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. జాతీయ రాజకీయాల్లో పాగా వేయడమే లక్ష్యంగా టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా ఆ పార్టీ అధినేత కేసీఆర్ మార్చారు. పేరు మార్పును కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఆమోదించింది. ఈ సమయంలో మరో సరికొత్త వాదన తెరపైకి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర సమితి పేరు మార్పుపై అభ్యంతరం చెబుతూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మారుస్తూ ఈసీ నోటిఫికేషన్ ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వ్యాజ్యంపై వెంటనే దర్యాప్తు చేయించాలని కోరారు. కాగా.. తెలంగాణలో పుట్టి తెలంగాణ గడ్డపై సర్వశక్తులూ ఒడ్డి, పార్టీని బలోపేతం చేసుకున్న టీఆర్‌ఎస్.. ఇప్పుడు బీఆర్‌ఎస్‌గా అవతరించింది. పార్టీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని యజ్ఞయాగాదులతో ఘనంగా నిర్వహించారు. యజ్ఞ యాగాలతో దివ్యముహూర్తాన బీఆర్‌ఎస్ కార్యాలయం ప్రారంభమైంది.
మరోవైపు.. టీ-కాంగ్రెస్ లో అసమ్మతి పోరు భగ్గుమంటోంది. అసలు వర్సెస్ వలస నేతల వైరంతో కాంగ్రెస్‌పార్టీ రెండుగా చీలిపోయింది. సీనియర్ నేతల తిరుగుబాటును లెక్కచేయని రేవంత్ టీమ్.. యాక్షన్‌లోకి దిగింది. నిన్న జరిగిన తెలంగాణ కాంగ్రెస్ ఎగ్జిక్యూటీవ్ సమావేశానికి సీనియర్ నేతలు ఎవ్వరూ హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇదిలాఉంటే.. సీనియర్ల విమర్శలకు రేవంత్ వర్గం రిజైన్లతో కౌంటరిచ్చింది. ఇప్పటివరకు 13 మంది రాజీనామాలు చేశారు. ఈ పరిణామాల మధ్య హైకమాండ్ ఏం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
అయితే.. ఇంత జరుగుతున్నా..అదేమీ లేదన్నట్లుగా కనిపించారు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి. సమావేశంలో కూడా గొడవకు తావివ్వకుండా కూల్‌గా ఎజెండాను అమలు చేశారు. ఏఐసీసీ చెబితేనే మీటింగ్ ఏర్పాటు చేశానని.. సమస్యలుంటే అధిష్ఠానం చూసుకుంటుందంటూ పేర్కొన్నారు. పార్టీ చీలినా పార్టీ కార్యాచరణ మాత్రం ఆగదంటోంది టీపీసీసీ.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..