
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి శేరి లింగంపల్లి నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం రాబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈసారి ప్రజలు కాంగ్రెస్‌కు అధికారం ఇవ్వాలని డిసైడ్ అయ్యారన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి అరికెపూడి గాంధీని చిత్తు చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలతో పాటూ టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజల సమస్యలను గల్లీ నుంచి ఢిల్లీ వరకూ తీసుకెళ్లి తన గళాన్ని వినిపించిన రేవంత్ రెడ్డిని నమ్మండి అంటూ ప్రజలను కోరారు. కాంగ్రెస్‌కు ఒక్కసారి అవకాశం ఇవ్వమని ప్రజలకు విన్నవించుకున్నారు. ఈ పదేళ్లలో కేసీఆర్ ఒక్కరోజు సచివాలయానికి రాలేదని, పాలనను ఇంటి నుంచే కొనసాగించారని విమర్శించారు.
ప్రజా గాయకుడు గద్దర్ కేసీఆర్‌ను కలిసేందుకు ప్రగతి భవన్‌కు వెళితే మూడు గంటల పాటు గేటు బయట నిలబెట్టారని మండిపడ్డారు. ప్రజల ధనంతో నిర్మించిన ప్రగతి భవన్‌లో ప్రజలు వెళ్లేందుకు అవకాశం ఇవ్వలేదన్నారు. అందుకే వాటి గేట్లు బద్దలు కొట్టాల్సిన సమయం ఆసన్నమైందని తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేశారు. ఈసారి కేసీఆర్‌కి అధికారమిస్తే తన మనవడిని మంత్రిని చేస్తారని ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరతామన్నారు. టీఎస్పీఎస్సీ ద్వారా పరీక్షలు నిర్వహించి వాటిలో ప్రశ్నాపత్రాల లీకేజీలకు పాల్పడ్డారని గుర్తు చేశారు. తద్వారా నియామకాల్లో అవకతవకలు జరిగి నిరుద్యోగుల జీవితాలతో ఈ ప్రభుత్వం చలగాటమాడుతోందని ధ్వజమెత్తారు. తెలంగాణ ఉద్యమంలో ఉవ్వెత్తున ఎగిసిన నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదు కానీ.. కేసీఆర్ కుటుంబంలో అందరికీ ఉద్యోగాలొచ్చాయని విమర్శించారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ఉన్న 30లక్షల మంది నిరుద్యోగుల సమస్యలను పట్టిపట్టనట్టు వ్యవహరిస్తున్నారని ఘాటుగా స్పందించారు.
తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో వేల ఎకరాల భూములను ఆక్రమించుకున్నారని ఆరోపించారు. ఇలాంటి వారిని ఓడించడం కోసం మీరందరూ నడుబిగించాలని విజ్ఞప్తి చేశారు. పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తానన్నారు.. మీకు ఎవరికైనా వచ్చాయా అని ప్రజలను అడిగారు రేవంత్ రెడ్డి. మీకు ఎవరికీ ఇళ్లు కట్టివ్వని కేసీఆర్‌కు నేను డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తానని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మంచి సంక్షేమంతో పాటూ నిరుద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మహిళలకు, వృద్దులు, వికలాంగులకు అండగా ఉంటామన్నారు. తమకు ఒక్కసారి అవకాశం ఇవ్వండంటూ శేరి లింగంపల్లి నియోజకవర్గ ప్రజలను, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, తెలుగుదేశం పార్టీ తమ్ముళ్ళను కోరారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..