Telangana Corona: తెలంగాణలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న తరుణంలో కరోనా పరిస్థితులపై రాష్ట్ర కోర్టు విచారణ చేపట్టింది. ఉదయం విచారణ చేపట్టిన న్యాయస్థానం ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా పరీక్షలు, రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలపై కీలక వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేసిన హైకోర్టు.. తదుపరి విచారణ మధ్యాహ్నం వరకు వాయిదా వేస్తూ అనంతరం మళ్లీ విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా న్యాయస్థానం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా లక్షణాల ఆధారంగా ఆస్పత్రుల్లో అడ్మిట్ చేసుకోవాలని తెలిపింది. రోజుకు 30-40 వేలు ఆర్టీపీసీఆర్ టెస్టులు చేస్తున్నామని ప్రభుత్వం తెలుపగా, ఈనెల 1 నుంచి ఇప్పటి వరకు 3.47 లక్షలు మాత్రమే టెస్టులు చేశారని, 8.40 లక్షల పరీక్షలు ఎందుకు చేయలేదని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఆర్టీపీసీఆర్ టెస్ట్ రిపోర్టు లేకున్నా ప్రతి ఆస్పత్రిలో అడ్మిషన్ ఇవ్వాలని కోర్టు సూచించింది. కరోనా కేసుల వివరాలు ప్రతి రోజు మీడియా బులిటిన్ విడుదల చేయాలని, యాదాద్రి భువనగి, నిర్మల్, జగిత్యాల, కామారెడ్డి, మేడ్చల్ మాల్కాజిగిరి జిల్లాల్లో చాలా కేసులు నమోదు అవుతున్నాయని, ఆయా జిల్లాల్లో టెస్టులు పెంచాలని ఆదేశించింది. అలాగే వసల కార్మికుల కోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని, కరోనా నియంత్రణకు ప్రత్యేక కమిటీ వేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. నైట్ కర్ఫ్యూ విధించడం కాదు.. ప్రజలను బయట తిరగనీయకూడదని సూచించింది. ఎన్నికల సభలు, సమావేశాలు, ర్యాలీలపై ఆంక్షలు విధించాలని, వైన్స్, బార్లు, సినిమా థియేటర్లపై పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
రాష్ట్ర వ్యాప్తంగా 108 అంబులెన్స్‌లు 1350 ఉన్నాయని, అందులో కాల్స్ రాగానే 450 వెళ్తున్నాయని ధర్మాసనానికి ప్రభుత్వం తెలపగా.. 108,104 టోల్ ఫ్రీ నెంబర్స్ ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలని హైకోర్టు సూచించింది. ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల దగ్గర డిస్‌ప్లే బోర్డ్ ఏర్పాటు చేయాలని, ఆర్టీసీఆర్ టెస్ట్ రీపోర్టు 24 గంటల్లో ఇచ్చే విధంగా చూడాలని తెలిపింది. ఆక్సిజన్ కొరత ఉందని ప్రభుత్వం చెబుతోందని, రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్‌లో ఆక్సిజన్ అందుబాటులో ఉండేలా చూడాలని తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా కంటైన్మెంట్ జోన్, మైక్రో కంటైన్మెంట్ జోన్ వివరాలు సమర్పించాలని న్యాయస్థానం ప్రభుత్వానికి తెలిపింది. తదుపరి విచారణను ఈనెల 27కు ధర్మాసనం వాయిదా వేసింది.
అలాగే ఉదయం కూడా విచారణ చేపట్టిన హైకోర్టు ప్రభుత్వంపై మండిపడింది. నైట్ కర్ఫ్యూ వల్ల కరోనా కేసులు తగ్గాయని ప్రభుత్వం కోర్టుకు తెలుపగా, ఎక్కడ కేసులు తగ్గాయో చూపించాలని హైకోర్టు ఎదురు ప్రశ్న వేసింది. బార్లు, సినిమా థియేటర్ల దగ్గర ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలుపాలని, కుంభమేళా వెళ్లిన వారిని ఇతర రాష్ట్రాలు క్వారంటైన్‌లో పెడుతున్నాయని, తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రాష్ట్ర సరిహద్దుల్లో ఎలాంటి చర్యలు చేపట్టారని హైకోర్టు ప్రశ్నించింది. అంతేకాదు ఆర్‌టీపీసీఆర్ టెస్ట్ రిపోర్టు 24 గంటల్లోపు ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలని, అదే వీఐపీలకు 24 గంటల్లోపే ఎందుకు ఇస్తున్నారని హైకోర్టు చురకలంటించింది. ప్రభుత్వం చెప్పిన వివరణపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఇవీ చదవండి: Proning: ప్రోనింగ్ విధానం ద్వారా ఆక్సిజన్ స్థాయిలను మెరుగు పర్చుకోవడం ఎలా..? కేంద్ర ఆరోగ్యశాఖ సూచనలు