ఎరక్కపోయి ఇరుక్కుపోయిన బెబ్బులి.. టెరిటోరియల్ ఫైట్‌లో టైగర్ ‘బ్రహ్మ’ మృతి!

ఆవాసం కోసం అలుపెరుగని ప్రయాణం చేస్తూ.. అడ్డొచ్చిన మనుషులపై దాడులు చేస్తూ రక్తం తాగుతున్నాయి. మరో వైపు తోటి పులులపై సైతం విరుచుకుపడుతూ పంజా విసురుతున్నాయి. చంద్రపూర్ జిల్లాలోని తడోబా అందేరి అభయారణ్యంలో చోటు‌ చేసుకున్న రెండు వేరు వేరు ఘటనల్లో ఓ బెబ్బులి హతమవగా.. మరో కిల్లర్ టైగర్ బోనుకు‌‌ చిక్కింది. ఇంకో బెబ్బులి తీవ్రగాయాలతో పర్యాటకుల కంట పడింది.

ఎరక్కపోయి ఇరుక్కుపోయిన బెబ్బులి.. టెరిటోరియల్ ఫైట్‌లో టైగర్ ‘బ్రహ్మ’ మృతి!
Tiger Territorial Fight

Edited By: Balaraju Goud

Updated on: May 14, 2025 | 11:21 AM

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సరిహద్దు జిల్లా చంద్రపూర్‌ను బెబ్బులిలు హైటెన్షన్‌కు గురి చేస్తున్నాయి. ఆవాసం కోసం అలుపెరుగని ప్రయాణం చేస్తూ.. అడ్డొచ్చిన మనుషులపై దాడులు చేస్తూ రక్తం తాగుతున్నాయి. మరో వైపు తోటి పులులపై సైతం విరుచుకుపడుతూ పంజా విసురుతున్నాయి. చంద్రపూర్ జిల్లాలోని తడోబా అందేరి అభయారణ్యంలో చోటు‌ చేసుకున్న రెండు వేరు వేరు ఘటనల్లో ఓ బెబ్బులి హతమవగా.. మరో కిల్లర్ టైగర్ బోనుకు‌‌ చిక్కింది. ఇంకో బెబ్బులి తీవ్రగాయాలతో పర్యాటకుల కంట పడింది. వరుస దాడులు ఆవాసం కోసం ఘర్షణలు తడోబా అభయారణ్యంలో సర్వసాదరణంగా మారిపోయాయి.

మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లా తడోబా అభయారణ్యంలోని రాందేగి అటవీ ప్రాంతంలో మంగళవారం(మే 13) రెండు పులుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో ఒకటి మృతి చెందగా, మరొకటి తీవ్రంగా గాయపడింది. గాయపడిన పులి పర్యాటకుల కంటపడటంతో టెరిటోరియల్ సమాచారం బయటకు పొక్కింది. వివరాల్లోకి వెళితే.. రాందేగి అటవీ ప్రాంతంలో చోటా మట్కా, నీలికన్నుల నయనతార అనే రెండు పులులు కొద్దికాలంగా పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి. వీరభద్ర, బ్రహ్మ అనే రెండు పులులు తాజాగా ఈ క్షేత్రంలోకి‌‌ ఆవాసం కోసం వలస వచ్చాయి.

ఈ నాలుగు పులుల మధ్య ఆవాసం కోసం కొన్ని రోజులుగా ఘర్షణ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే శనివారం(మే 10) ఉదయం ప్రాంతంలో బ్రహ్మ అనే పులికి చోటా మట్కా అనే పులి ఎదురు పడింది. ఇంకేముంది రెండు పులులు బద్ద శత్రువుల్లా భీకర పోరుకు దిగాయి. ఈ ఘర్షణలో తీవ్రగాయాలపాలైన బ్రహ్మ అనే వలస పులి చనిపోయింది. ఈ ఘర్షణలో గాయాల పాలైన చోటా మట్కా అనే పులి ప్రాణాలతో బయటపడింది. అలా బయటపడ్డ చోటా మట్కా మంగళవారం పర్యాటకుల కంటపడింది. దీంతో గాయాలపాలైన పులి సంచారాన్ని కెమెరాలో బంధించారు పర్యాటకులు. స్థానిక అటవీ శాఖ అదికారులకు ఈ విషయాన్ని తెలియజేశారు.

రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు.. చోటా మట్కా కోసం గాలింపు చేపట్టారు. సరిగ్గా అదే సమయంలో పులి కళేబరం అటవీ శాఖ అధికారులకు కనిపించింది. దాని పాదముద్రల ఆధారంగా బ్రహ్మ అనే పులిగా గుర్తించి పంచనామా నిర్వహించి ఖననం చేశారు. గాయపడ్డ దాన్ని పట్టుకునేందుకు గాలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, చోటా మట్కా అనే పులి గతంలో తన క్షేత్రంలోకి వచ్చిన భజరంగ్, మోగ్లి అనే మరో రెండు పులులను హతమార్చినట్టు అటవీ శాఖ అదికారులు‌ తెలిపారు.

మరోవైపు ఇదే జిల్లాలోని సిందెవాహి తాలుకా డోంగర్గావ్ అటవీ క్షేత్రంలో తునికాకు కూలీల ప్రాణాలు తీస్తున్న కిల్లర్ టైగర్ ను రెస్క్యూ చేసి బంధించారు అటవీశాఖ అధికారులు. చంద్రపూర్ జిల్లాలోని సిందెవాహి తాలుకా డోంగర్గావ్ అటవీ క్షేత్రంలో ఐదుగురు మహిళలను హతమార్చిన కిల్లర్ టైగర్‌ను రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి బంధించారు మహారాష్ట్ర అటవీ అధికారులు. మే నెల 10వ తేదీన తునికాకు సేకరణకు వెళ్లిన ముగ్గురు మహిళలపై దాడి చేసి హతమార్చింది. మ్యాన్ ఈటర్ డోంగర్గావ్ అటవీ ప్రాంతంలో పులి కదలికలను గమనించి మత్తు ఇంజక్షన్ ఇచ్చి పట్టుకున్నారు చంద్రపూర్ రెస్క్యూ టీం. బోనుకు చిక్కిన కిల్లర్ టైగర్ నాలుగు రోజుల్లోనే ఐదుగురిపై పంజా విసిరినట్టు గుర్తించారు.

ఈ పులి దాడిలో ఈ నెల 10న చంద్రాపూర్ జిల్లా సిందెవాహి తాలూకా మెండ మాల గ్రామం చార్గావ్ అటవీ క్షేత్ర పరిధిలో ఓ చెరువు సమీపంలో కొంత చౌదరి(65), శుభాంగి చౌదరి(28), రేఖాసిండే(51) అనే ముగ్గురు కూలీలను తన పిల్లలతో కలిసి దాడి చేసి చంపింది ఈ మ్యాన్ ఈటర్. మరుసటి రోజు ఈనెల 11న మూల్ తాలుకా నాగోడ గ్రామానికి చెందిన విమల షిండే (64) అనే మహిళపై దాడి చేసి హతమార్చింది. వరుస దాడులతో బెంబెలెత్తిస్తున్న మ్యాన్ ఈటర్ ను పట్టుకునేందుకు‌ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన మహారాష్ట్ర అటవీ శాఖ ఎట్టకేలకు సక్సెస్ అయింది. తడోబా అందేరి, సిందెవాహి అభయారణ్యంలో పులుల సంఖ్య పెరగడంతోనే ఈ దాడులు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..