పెద్దపల్లి జిల్లా రామగుండం-3 పరిధిలో జరిగిన సింగరేణి గని(Singareni Mines) ప్రమాద ఘటన విషాదాంతమైంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. గనిలో చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు కొనసాగించారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం చైతన్యతేజ, జయరాజ్, శ్రీకాంత్ మృతిచెందినట్లు రెస్క్యూ టీం గుర్తించారు. వారి మృతదేహాలను(Dead Bodies) వెలికితీశారు. అనంతరం సింగరేణి ఆస్పత్రికి తరలించారు. రెండు రోజుల క్రితం అడ్రియాల్ భూగర్భ గనిలో ప్రమాదవశాత్తు పైకప్పు కూలింది. ఇటీవల కూలిన పై కప్పును సరిచేస్తుండగా ఈ ప్రమాదం జరగడం విషాదం(Tragedy) నింపింది. కార్మికులు, అధికారులు పని చేస్తున్న సమయంలో గని పై కప్పు కూలింది. ఈ ప్రమాదంలో ఆరుగురు చిక్కుకున్నారు. ఘటన జరిగిన రోజే ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. మిగతా నలుగురి కోసం గాలించగా.. నిన్న సాయంత్రం బదిలీ వర్కర్ రవీందర్‌ను సిబ్బంది కాపాడారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో అసిస్టెంట్ మేనేజర్ చైతన్య తేజ విగతజీవిగా కనిపించారు. శిథిలాల కింద చిక్కుకున్న మరో ఇద్దరు సేఫ్టీ మేనేజర్ జయరాజ్, ఒప్పంద కార్మికుడు శ్రీకాంత్ మృతి చెందారు. వారి మృతదేహాలను సిబ్బంది వెలికితీశారు.
బొగ్గుగనిలో సపోర్టుగా ఏర్పాటుచేసే పిల్లర్ తొలగించడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు, అధికారులు నిర్ధరించారు. గనుల్లో తలెత్తే ఒత్తిడిని తట్టుకునేందుకు బొగ్గు తవ్వే మార్గంలో పైకప్పునకు దన్నుగా పిల్లర్లు ఏర్పాటు చేస్తారు. అడ్రియాల గనిలో 86 నుంచి 87 లెవల్ వరకు ఉండాల్సిన మూడు పిల్లర్లలో మధ్యలో ఉన్నదాన్ని తొలగించారు. దీంతో పైకప్పు ఒత్తిడికి గురై 20 రోజుల క్రితం పడిపోయింది. కూలిన ప్రాంతాన్ని సరిచేసేందుకు పనులు చేపట్టిన కొద్ది గంటల్లోనే.. మళ్లీ కూలి సిబ్బందిపై పడింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందడం విస్తుగొలుపుతోంది.
Also Read
Arjuna Fruit: అర్జునపండులో అదిరే ఔషధ గుణాలు.. నోటి దుర్వాసనకి చక్కటి పరిష్కారం..
AP New Districts: పోటా పోటీగా ఉద్యమాలు.. రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయడమే లక్ష్యం