Telangana News: విధికి కనికరమనేదే ఉండదేమో.. నాడు తండ్రి, నేడు తల్లి.. పాపం ఆ ఆడ బిడ్డలు..!

|

Dec 18, 2021 | 6:38 PM

Telangana: మూడేళ్ల క్రితం క్యాన్సర్ వ్యాధి కారణంగా తండ్రి మృతి చెందాడు. అప్పటి నుంచి అన్నీ తానై ఏ లోటు లేకుండా ఆలనా పాలనా

Telangana News: విధికి కనికరమనేదే ఉండదేమో.. నాడు తండ్రి, నేడు తల్లి.. పాపం ఆ ఆడ బిడ్డలు..!
Help
Follow us on

Telangana: మూడేళ్ల క్రితం క్యాన్సర్ వ్యాధి కారణంగా తండ్రి మృతి చెందాడు. అప్పటి నుంచి అన్నీ తానై ఏ లోటు లేకుండా ఆలనా పాలనా చూసుకుంది తల్లి. జీవనం సవ్యంగా సాగుతున్న తరుణంలో విధి వారిని మరోసారి వెక్కిరించింది. తాజాగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లిని మృత్యువు కబళించింది. విధి ఆడిన నాటకంలో అనాధలుగా మారారు ఆ ముగ్గురు అక్కాచెల్లెల్లు.

వివరాల్లోకెళితే.. మహబూబ్‌నగర్ జిల్లా మనికొండ గ్రామానికి చెందిన ముగ్గురు చిన్నారు అనాధలుగా మారారు. కనీసం ఉండడానికి కూడా ఇళ్లు లేక. ఆదుకునే పెద్ద దిక్కులేక.. దిక్కుతోచని స్థితిలో పడ్డారు. మూడేళ్ల క్రితం తండ్రి ఆనంద్ ను క్యాన్సర్ వ్యాధి కాటేసింది. వారం రోజుల క్రితం అప్పాయిపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లి సుజాత మృతి చెందింది. దాంతో ఆ ముగ్గురు అక్కచెల్లెల్లు అనాధలుగా మిగిలిపోయారు. ఆలనాపాలన చూసేవారు లేక.. ఆపన్న హస్తం కోసం దీనంగా ఎదురు చూస్తున్నారు.

సరిగ్గా వారం రోజుల క్రితం అప్పాయిపల్లి వద్ద తప్పతాగి మదమెక్కిన ముగ్గురు యువకులు కారు నడుపుతూ ఆటోను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో మొత్తం ఐదుగురు మరణించారు. మరణించిన వారిలో సుజాత కూడా ఉంది. ఆరోగ్యం బాగా లేకపోవడంతో వైద్యం కోసం దేవరకద్రకు వెళ్లింది. అక్కడి నుంచి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో సుజాత రెండు కాళ్లు, చేతులు విరిగిపోయాయి. అంతర్గతంగా బలమైన గాయాలయ్యాయి. కొన ఊపిరితో ఉన్న సుజాతను మహబూబ్‌నగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అర్థరాత్రి సుజాత మృతి చెందింది.

అయితే, మనికొండ గ్రామానికి చెందిన ఆనంద్, సుజాత లకు ముగ్గురు ఆడ పిల్లలు ఉన్నారు. నందిని ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. సింధుజ ఎనిమిదో తరగతి, బింధు మూడో తరగతి చదువుతోంది. ఆనంద్ అదే గ్రామంలో వ్యవసాయ మోటార్లు రిపేరు చేస్తూ కుటుంబాన్ని పోషించుకునే వాడు. మూడేళ్ల క్రితం క్యాన్సర్ వ్యాధితో ఆనంద్ మరణించాడు. అప్పటి నుంచి సుజాత ఇంట్లోనే బట్టలు కుడుతూ ముగ్గురు కూతుళ్లను పోషిస్తూ వచ్చింది. అయితే, సుజాతకు కడుపులో నొప్పి వస్తుండడంతో ఈనెల 9వ తేదీన దేవరకద్రలో హాస్పిటల్‌కు వెళ్లింది. తిరుగు ప్రయాణంలో ఆటో ఎక్కింది. ఆటో ఎక్కే సమయంలో పెద్ద కూతురు నందిని ఫోన్లో మాట్లాడింది. ఆటో ఎక్కుతున్నాను వచ్చేస్తున్నానని సమాధానం చెప్పింది.

ఆటో అప్పాయిపల్లి వద్దకు రాగానే మహబూబ్ నగర్ వైపు నుంచి వస్తున్న కారు.. ఆటోను బలంగా ఢీకొట్టింది. కారులో ఉన్న ముగ్గురు యువకులు తప్పతాగి ఉన్నారు. ఆటోలో ఉన్న వారంతా రోడ్డుపై చెల్లా చెదురుగా పడ్డారు. ఆటోలో ఎక్కువ శాతం మహిళలే ఉన్నారు. ఎవరు చనిపోయారో.. ఎవరు బతికున్నారో అర్థం కానీ పరిస్థితి. ప్రమాదానికి గురైన వారి హాహాకారాలు, ఆర్తనాదాలతో ఆ ప్రాంతం దయనీయంగా మారింది. తప్పతాగి డ్రైవింగ్ చేసింది కాక.. స్థానికులపై ఆ యువకులు తిరగబడ్డారు. దీంతో కోపోద్రిక్తులైన స్థానికులు వారికి దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు.

ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఐదు కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అందులో ఒక కుటుంబం.. సుజాత కుటుంబం. ఈ చిన్నారులు ప్రస్తుతం దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ప్రస్తుతం వీరికి ఉండడానికి ఇళ్లు కూడా లేదు. పైగా ఆదుకునే పెద్ద దిక్కు లేదు. అంతేగాక జీవిత అనుభవం కూడా వీరికి లేదు. ముందున్న జీవితం ఎలా గడుస్తోందోనని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు ఆ ముగ్గురు అక్కాచెల్లెల్లు. ప్రభుత్వం ముందుకు వచ్చి వీరికి ఓ ఇళ్లు ఇవ్వాలని, చదువుకునేందుకు తగిన సౌకర్యాలు కల్పించడంతో పాటు భవిష్యత్తు దెబ్బతినకుండా ఆదుకోవాలని కోరుతున్నారు స్థానికులు.

Also read:

Delhi News: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. ఆటోరిక్షాపై బోల్తాపడిన కంటైనర్.. నలుగురు మృతి, పరారీలో డ్రైవర్

Assembly Elections 2022: 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ కసరత్తు.. జనవరిలో షెడ్యూల్ విడుదలయ్యే ఛాన్స్!

MLA RK Roja Comments: రాజధాని రైతుల సభపై ఎమ్మెల్యే ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు