Telangana: అయ్యబాబోయ్.. ఠారెత్తిస్తున్న ఎండలు.. 3 రోజులు ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్.!

|

Apr 18, 2024 | 7:59 AM

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఐఎండీ హెచ్చరిక జారీచేసింది. రాగల మూడు రోజులు ప్రస్తుత ఉష్ణోగ్రతలపై 2 నుంచి 3 డిగ్రీ సెంటిగ్రేడ్‌ వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.

Telangana: అయ్యబాబోయ్.. ఠారెత్తిస్తున్న ఎండలు.. 3 రోజులు ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్.!
Heat Waves
Follow us on

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలను దాటేశాయి. పలు మండలాల్లో తీవ్ర వడగాలులు కూడా వీస్తున్నాయి. రాష్ట్రంలో రాగల మూడు రోజులు 2 నుంచి 3 డిగ్రీ సెంటిగ్రేడ్‌ల వరకు అధిక ఉష్ణోగ్రత్తలు నమోదయ్యే అవకాశం ఉందని హైదారాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రేపు, ఎల్లుండి కుమ్రంభీమ్‌ ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో వడగాల్పులు వీస్తాయని తెలిపింది వాతావరణశాఖ. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ మూడు రోజుల పాటు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది.

ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు ప్రజలెవరూ బయటకు రావొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. అత్యవసర పరిస్థితుల్లో రావాల్సి వస్తే, తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. డీహైడ్రేట్‌ బారిన పడకుండా ఉండేందుకు పళ్లరసాలు, ఓఆర్ఎస్‌ ద్రావణాలను తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. రాష్ట్రంలో 2015, 16 తర్వాత 2024లో మళ్లీ అదే స్థాయిలో అధిక ఉష్ణోగ్రతలు పునరావృతం అవుతున్నాయి. ద్రోణి మన్నార్ గల్ఫ్ నుండి అంతర్గత తమిళనాడు, రాయలసీమ మీదుగా దక్షిణ తెలంగాణ వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో కొనసాగుతోందని స్పష్టం చేసింది. ఇవాళ, రేపు కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది.