Telangana: నాగర్ కర్నూల్ కాలేజీలో వెరైటీ దొంగల చోరీ.. వెళ్తూ.. బోర్డుపై ఏం రాశారంటే..?

| Edited By: Ram Naramaneni

Jan 03, 2024 | 6:23 PM

ఘటన డిసెంబర్ 31న రాత్రి జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మంగళవారం ఉదయం తరగతి గది డోర్ లాక్ ఓపెన్ చేద్దామని చూసేసరికి సిబ్బంది షాక్ అయ్యారు. డోర్‌కు ఉన్న తాళం కప్పు వద్ద గొళ్లెంను ధ్వంసం చేసి ఉండడాన్ని గ్రహించారు. తలుపులు తీసి చూసి దొంగలు  సృష్టించిన అరాచకంపై వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.

Telangana: నాగర్ కర్నూల్ కాలేజీలో వెరైటీ దొంగల చోరీ.. వెళ్తూ.. బోర్డుపై ఏం రాశారంటే..?
Girls College
Follow us on

సాధారణంగా దొంగతనం చేస్తే ఎలాంటి ఆధారాలు వదలకుండా వెళ్తారు దొంగలు. అందుకోసం ఎన్నో అడ్డదారులు తొక్కుతుంటారు. వేలిముద్రలు దొరక్కుండా చేతులకు గ్లౌజులు, కాళ్లకు సాక్సులు, మొఖాలకు ముసుగులు వేసుకొని ఎవరు గుర్తుపట్టకుండా చోరీలకు పాల్పడుతుంటారు. కానీ నాగర్ కర్నూల్ జిల్లాలో చోరి చేయడమే కాకుండా తాము చోరి ఎందుకు చేసామో అని కారణం సైతం రాసి వెళ్లారు.

నాగర్ కర్నూల్ జిల్లాలో వెరైటీ దొంగలు కలకలం సృష్టించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజిలోని ప్రాక్టికల్స్ సామాగ్రికి సంబంధించిన గదిలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కాపర్ వైర్లను చోరి చేశారు. వివిధ గదుల్లో ఉండే సీలింగ్ ఫ్యాన్లను ఊడదీసి అందులోని కాపర్ వైర్లను దొంగిలించారు. అనంతరం ఈ ఫ్యాన్లను తగులబెట్టారు. అయితే దొంగతనం చేయడం వరకు సరే… తాము దొంగతనం ఎందుకు చేసామో అని క్లాస్ రూమ్ లో ఉన్న బ్లాక్ బోర్డ్ పై వ్రాసి వెళ్లారు ఈ చోరకళాకారులు. “మా అవసరాల కోసమే ఈ పాఠశాలలోని ఎలక్ట్రిక్ వైర్లను దొంగిలించాం… మిగిలిన భాగాలన్ని మీకే… మమ్మల్ని మన్నించండి” అంటూ వ్రాసి వెళ్లారు. దీంతో పాటుగా “సలార్ మూవీని చూసి ఎంజాయ్ చేయండి” అంటూ ఈ దొంగలు ఉచిత సలహాను సైతం ఇచ్చారు.

ఘటన డిసెంబర్ 31న రాత్రి జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మంగళవారం ఉదయం తరగతి గది డోర్ లాక్ ఓపెన్ చేద్దామని చూసేసరికి సిబ్బంది షాక్ అయ్యారు. డోర్‌కు ఉన్న తాళం కప్పు వద్ద గొళ్లెంను ధ్వంసం చేసి ఉండడాన్ని గ్రహించారు. తలుపులు తీసి చూసి దొంగలు  సృష్టించిన అరాచకంపై వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చోరి చేసింది జిల్లా కేంద్రానికి చెందిన అకతాయిల పనే అయి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజ్ వద్ద పర్యవేక్షణ  తక్కువగా ఉండడాన్ని అసరాగా చేసుకొని ఈ రకంగా చోరికి పాల్పడి ఉంటారని చెబుతున్నారు. బాలికలు జూనియర్ కాలేజీలో దొంగతనానికి పాల్పడ్డవారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి