కొందరు రూపాయి రూపాయి కూడగట్టుకొని డబ్బులు వెనకెసుకుంటారు. ఆ డబ్బులను కొందరు బ్యాంక్‌లో వేసుకుంటే, మరికొందరు నగలు వంటి వాటిని కొనుగోలు చేస్తారు. అయితే ఇంత దాచుకొని కష్టపడి సంపాదించుకున్న డబ్బును ఎవడో దొంగ వచ్చి ఎత్తుకుపోతే ఎలా ఉంటుంది? తాజాగా అలాంటి ఘటనే ఒక్కటి జరిగింది. ఈ ఘటన నారాయణపేట జిల్లాలో చోటుచేసుకుంది.
మక్తల్ బస్టాండులో ద్విచక్ర వాహనం పై ఉంచిన బ్యాగులో నుండి రూ.2.50లక్షల నగదు అపహరణకు గురైంది. మాగనూర్ మండలం వడ్వాట్ గ్రామానికి చెందిన సురేందర్ శెట్టి తన బంగారాన్ని తాకట్టు పెట్టగా పొందిన రుణంతో ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మార్గమధ్యలో బస్టాండ్ వద్ద ఓ షాప్‌కు వెళ్లివచ్చేలోపు ఓ దుండగుడు నగదును ఎత్తుకెళ్లాడు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.