Rythu Bharosa: రైతు భరోసాపై రేవంత్ సర్కార్ బిగ్ షాకింగ్ న్యూస్.. వారికి డబ్బులు బంద్

తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని సమర్ధవంతంగా అమలు చేసేందుకు సిద్దమవుతోంది. రైతులకు మాత్రమే లాభం జరిగేలా పారదర్శకతతో ఈ పథకాన్ని అమలు చేసేందుకు అనేక రూల్స్ తీసుకొస్తుంది. ఈ క్రమంలో పంట సాగు చేస్తున్న రైతులకు మాత్రమే రైతు భరోసా ఇవ్వనున్నారు.

Rythu Bharosa: రైతు భరోసాపై రేవంత్ సర్కార్ బిగ్ షాకింగ్ న్యూస్.. వారికి డబ్బులు బంద్
Rythu Bharosa

Updated on: Dec 25, 2025 | 8:40 AM

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోన్న రైతు భరోసా పథకంపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. సాగు చేస్తున్న పంట భూములకు మాత్రమే రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని తెలిపారు. ఈ మేరకు శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా సాగు భూములను గుర్తించనున్నారు. త్వరగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. శాటిలైట్ ఫొటోల క్రీడకరణ పూర్తి చేసి నివేదికను వెంటనే సమర్పించాలని అధికారులకు సూచించారు. ఈ నివేదిక వచ్చిన తర్వాతనే రైతు భరోసా నిధులు జమ చేయున్నట్లు తెలిపారు. యాసంగిలో పంట పండిస్తున్న భూములను శాటిలైట్ ద్వారా గుర్తించే ప్రక్రియ ప్రభుత్వం కొనసాగిస్తుంది. దీంతో రాబోయే రైతు భరోసా డబ్బులు పంట పండిస్తున్న భూములకు మాత్రమే ఇవ్వనున్నారు. సాగులో లేని భూములకు రైతు భరోసా కట్ చేయనున్నారు.

10 లక్షల ఎకరాలకు కట్

పంట సాగు చేయని 10 లక్షల ఎకరాలకు రైతు భరోసా కట్ కానుందని తెలుస్తోంది. సాగులో ఉన్న భూములకు మాత్రమే రైతు భరోసా అందిస్తామని గతంలో రేవంత్ రెడ్డి పలుమార్లు ప్రకటించారు. అందుకు తగ్గట్లు గతంలో సాగు భూములకే మాత్రమే రైతు భరోసా డబ్బులు జమ చేశారు. సాగుకు పనికిరాని భూములను గుర్తించి వారికి రైతు భరోసా బంద్ చేశారు. దీని వల్ల ప్రభుత్వానికి అర్ధిక భారం తగ్గడంతో పాటు అర్హులైన రైతులకు మాత్రమే రైతు భరోసా అందనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎకరానికి రూ.6 వేల చొప్పున రైతు భరోసా అందిస్తోంది. గతంలో ఎకరానికి రూ.5 వేలు ఇచ్చేవారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం పెంచింది.

జనవరిలో కొత్త పథకం

వచ్చే ఏడాది జనవరిలో రైతుల కోసం మరో కొత్త పథకం ప్రారంభిస్తున్నట్లు తుమ్మల తెలిపారు. వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని జనవరిలో సీఎం రేవంత్ రెడ్డి తిరిగి ప్రారంభిస్తారని, దీని ద్వారా రైతులకు రాయితీపై వ్వయసాయ యంత్రాలు, పరికరాలు అందిస్తామని తెలిపారు. జనవరి తొలి వారంలో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తారని, రైతులకు అందుతున్న రాయితీల గురించి తెలుసుకుంటారని అన్నారు. అలాగే వ్యవసాయ యాంత్రీకరణ పథకం దరఖాస్తులను పరిశీలిస్తారని అన్నారు. అటు యూరియాను రైతులు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునేలా తీసుకొచ్చిన యాప్‌ను రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానున్నట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఐదు జిల్లాల్లో మాత్రమే యూరియా యాప్ సేవలు అందుబాటులో ఉన్నాయని, త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అందరికీ అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. యాప్ ద్వారా అవసరమైన యూరియాను రైతులు కొనుగోలు చేయవచ్చని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.