సమస్య ఏదైనా ఉంటే అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్తాం. సమస్యల పరిష్కారానికి ఆందోళన చేస్తుంటారు. కానీ ఓ ఆశా వర్కర్ మాత్రం ఎమ్మెల్యే ఎదుట చేసిన తీరు అందరినీ అశ్చర్యానికి గురి చేసింది.
నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం పార్వతీపురంలో విష జ్వరాలు సోకాయి. ఈ గ్రామానికి చెందిన ఆశా వర్కర్ తన బాధ్యతను నిర్వర్తించింది. కానీ ఇటీవల విషజ్వరాలతో గ్రామస్తులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. విషయం తెలుసుకున్న నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జై వీర్ రెడ్డి గ్రామాన్ని సందర్శించి, అధికారులతో సమీక్ష నిర్వహించారు. విష జ్వరాలపై గ్రామస్తులతో ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి మాట్లాడుతుండగా ఒక్కసారిగా ఆశావర్కర్ వెంకటలక్ష్మి అక్కడికి వచ్చి బ్లేడుతో తన చేతిని గాయపర్చుకుంది.
హఠాత్తు పరిణామంతో ఎమ్మెల్యేతో పాటు అక్కడున్న అధికారులు, గ్రామస్తులు అవాక్కయ్యారు. గ్రామానికి చెందిన కొందరు స్థానిక నేతలు తనను వేధిస్తున్నారని ఎమ్మెల్యే ఎదుట వాపోయింది. వేధింపులు భరించలేకపోతున్నానంటూ, వెంట తెచ్చుకున్న బ్లేడుతో తన ఎడమ చేతిపై మూడు గాట్లు పెట్టుకుంది. వెంటనే అక్కడే ఉన్న మరో ఇద్దరు ఆశా వర్కర్లు వెంకటలక్ష్మికి ప్రాథమిక చికిత్స చేశారు. వెంకటలక్ష్మికి పెద్దగా గాయం కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దీంతో వెంకటలక్ష్మిని వేధిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే జై వీర్ రెడ్డి హామీ ఇచ్చారు. సమస్యలుంటే చెప్పుకోవాలి కానీ ఇలా గాయపర్చుకోవడమేంటని ఎమ్మెల్యే వెంకటలక్ష్మిని సున్నితంగా మందలించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..