Cold Waves: బాబోయ్ చలిపులి పంజా.. రికార్డ్ స్థాయిలో పడిపోయిన ఉష్ణోగ్రతలు.. వాతావరణశాఖ హెచ్చరిక ఇదే..

తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. గత కొద్దిరోజులుగా రికార్డ్ స్ధాయిలో చలి తీవ్రత ఉండగా.. అంతకంతకు దిగజారుతోంది. దీంతో ప్రజలు చలి, పొగమంచుతో ఇబ్బందులకు గురవుతున్నారు. రాబోయే మూడు నెలల పాటు ఇలాగే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణవాఖ తెలిపింది. ఆదివారం ఇలా..

Cold Waves: బాబోయ్ చలిపులి పంజా.. రికార్డ్ స్థాయిలో పడిపోయిన ఉష్ణోగ్రతలు.. వాతావరణశాఖ హెచ్చరిక ఇదే..
Cold Conditions In Telangana

Updated on: Dec 22, 2025 | 7:11 AM

తెలుగు రాష్ట్రాల్లో చలిపులి చంపేస్తోంది. చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు గజ గజ వణికిపోతున్నారు. రాత్రి, ఉదయం వేళల్లోనే కాకుండా మధ్యాహ్నం పూట కూడా చలి వణికిస్తోంది. దీంతో ప్రజలు స్పెట్టర్లు, మఫ్టర్లు వాడుతూ చలి నుంచి రక్షణ పొందుతున్నారు. ఇప్పటికే కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోగా.. రాబోయే నెలల్లో మరింతగా దిగజారే అవకాశముందని వాతావరణశాఖ చెబుతోంది. మార్చి వరకు చలి ఇలాగే కొనసాగే అవకాశముందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఉదయం పొగమంచు ఎక్కువగా ఉండటంతో ప్రయాణాలు చేసేవారు మరింతగా ఇబ్బందులకు గురవుతున్నారు.

తెలంగాణలో తీవ్రమైన చలితో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. అత్యల్ప స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదివారం సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో రాష్ట్రంలోనే అతి తక్కువగా 5 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత రికార్డ్ అయింది. ఇక రంగారెడ్డి జిల్లాలోని రెడ్డిపల్లిలో 6.9 డిగ్రీలు, జగిల్యాల జిల్లా కథలాపూర్‌లో 10.1, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మానాలలో 9.9, సిద్దిపేట జిల్లాలోని పోతారెడ్డిపేటలో 8.9, నిజామాబాద్ జిల్లా సాలూరలో 8.6 డిగ్రీల సెల్సియస్, మెదక్ జిల్లా దామరంచలో 7.9, కామారెడ్డి జిల్లా రామరలక్ష్మణ్ పల్లిలో 7.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు స్పష్టం చేశారు.

ఇక హైదరాబాద్ విషయానికొస్తే.. నిర్మల్‌లో 9.4 డిగ్రీల సెల్సియస్ నమోదవ్వగా. .నారాయణపేటలో 9.5, మౌలాలిలో 9.1 డిగ్రీలు నమోదైంది. నగరంలోని అనేక ప్రాంతాల్లో సింగిల్ డిజిట్‌కే ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దీంతో నగరవాసులు ఇంటి నుంచి బయటకు రాకపోతుండటంతో రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. చలికి తోడు పొగమంచుతో సిటీ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక రాబోయే రెండు రోజుల పాటు చలి మరింత తీవ్రంగా ఉంటుందని, మరో రెండు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశముందని వాతావరణశాఖ స్పష్టం చేసింది. కనిష్ట ఉష్ణోగ్రతలు 12 డిగ్రీలు, గరిష్ట ఉష్ణోగ్రతలు 29 డిగ్రీలుగా నమోదయ్య అవకాశముదని వాతావరణశాఖ స్పష్టం చేసింది. ప్రజలు చలి నుంచి రక్షణ పొందేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది.