Water dispute: తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ మొదలైన జల వివాదం.. కృష్ణ జలాల కేంద్రంగా

| Edited By: Narender Vaitla

Aug 12, 2023 | 1:43 PM

గతేడాది తాము వినియోగించుకోకుండా నాగార్జునసాగర్ రిజర్వాయర్ లో పొదుపు చేసిన 18 టీఎంసీల నీళ్లు ఉన్నాయని, ఈ నీళ్లను వినియోగంపై తమకే హక్కు ఉందని తెలంగాణ చెబుతోంది. ఈ నీటిని క్యారీ ఓవర్ కింద తాము ఈ నీటి సంవత్సరం 2023-24లో తొలి సీజన్‌లో తాగు, సాగునీటి అవసరాలకు వాటిని వినియోగించుకుంటామని తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ సి. కృష్ణా బోర్డు చైర్మన్‌కు లేఖ రాశారు. కృష్ణా జలాలకు సంబంధించి గత ఏడాది నిల్వను ఇప్పుడు వినియోగించుకుంటున్నందున దీన్ని ఈ ఏడాది...

Water dispute: తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ మొదలైన జల వివాదం.. కృష్ణ జలాల కేంద్రంగా
Krishna Water Dispute
Follow us on

తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ జల జగడాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. నాగార్జున సాగర్ లోని కృష్ణ జలాల కేంద్రంగా మరోసారి రెండు రాష్ట్రాల మధ్య జల వివాదం తలెత్తింది. సాగర్ జలాల వాడకం విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకుంటున్నాయి. ఎగువ కృష్ణా పరివాహక ప్రాంతంలో కురిసిన వర్షాలకు కృష్ణ బేసిన్ లోని ఆల్మట్టి, నారాయణపూర్, జూరాలకు భారీగా వరద రావడంతో పూర్తిస్థాయికి చేరుకున్నాయి. కానీ శ్రీశైలంకు కొంత నీరు వచ్చి చేరింది. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు నీటి ప్రవాహం లేదు. దీంతో నాగార్జునసాగర్ జలాల వాడకంపై తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం మరోసారి తెరపైకి వచ్చింది.

గతేడాది తాము వినియోగించుకోకుండా నాగార్జునసాగర్ రిజర్వాయర్ లో పొదుపు చేసిన 18 టీఎంసీల నీళ్లు ఉన్నాయని, ఈ నీళ్లను వినియోగంపై తమకే హక్కు ఉందని తెలంగాణ చెబుతోంది. ఈ నీటిని క్యారీ ఓవర్ కింద తాము ఈ నీటి సంవత్సరం 2023-24లో తొలి సీజన్‌లో తాగు, సాగునీటి అవసరాలకు వాటిని వినియోగించుకుంటామని తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ సి. కృష్ణా బోర్డు చైర్మన్‌కు లేఖ రాశారు. కృష్ణా జలాలకు సంబంధించి గత ఏడాది నిల్వను ఇప్పుడు వినియోగించుకుంటున్నందున దీన్ని ఈ ఏడాది కోటా కింద పరిగణించవద్దని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఈ18 టీఎంసీలను వాడుకోవడం ద్వారా ఏపి నీటి హక్కులకు ఎలాంటి భంగం కలగదని తెలంగాణ నీటి పారుదల అధికారులు లేఖలో పేర్కొన్నారు. తాము వాడుకోకుండా పొదుపు చేసిన కృష్ణా జలాలను నిల్వ చేసుకోవడానికి తమకు ప్రత్యేకంగా ఆఫ్‌లైన్‌ జలాశయాలు లేకపోవడంతో 2023-24 నీటి సంవత్సరానికి సంబంధించిన తాగు, సాగునీటి అవసరాల కోసం ఉమ్మడి జలాశయం సాగర్‌లోనే నిల్వ చేసుకోవాల్సి వచ్చిందని తెలిపింది.

గతేడాది ఏపీకి కేటాయించిన నీటి వాటాకు మించి 51.745 టీఎంసీల కృష్ణా జలాలను వినియోగించిందని తెలంగాణ సర్కార్ ఆరోపించింది. సాగర్‌ కుడి కాల్వ కింద వార్షిక తాగునీటి అవసరాలు 2.84 టీఎంసీలుమాత్రమే కృష్ణా రివర్ బోర్డు కేటాయించిందని, తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ లోని 5 టీఎంసీల నీళ్లను కేటాయించాలని గత నెలలో ఏపీ కోరడం పట్ల లేఖలో తెలంగాణ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. 2022-23లో 205 టీఎంసీలను, 34:66 నిష్పత్తిలో 51 టీఎంసీలను ఏపీ ఎక్కువగా వాడుకుందని తెలంగాణ అధికారులు చెబుతున్నారు. అదనంగా వినియోగించుకున్న 51టీఎంసీలను ఈ సంవత్సరపు ఏపీ నీటి కోటా నుంచి మినహాయించాలని బోర్డును తెలంగాణ డిమాండ్ చేస్తోంది. త్వరలో జరగనున్న త్రిసభ్య కమిటీ సమావేశంలో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని నీటి కేటాయింపులు చేయాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డును తెలంగాణ కోరింది.

ఇవి కూడా చదవండి

తెలంగాణ, ఏపీలకు ఆగస్టు, సెప్టెంబరులకు నీటిని కేటాయించేందుకు ఈ 21న హైదరాబాద్‌లో త్రిసభ్య కమిటీ సమావేశాన్ని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏర్పాటు చేస్తోంది. శ్రీశైలం, నాగార్జున సాగర్ లలో ఉన్న నీటి నిల్వలు, వినియోగంపై త్రిమెన్ కమిటీ చర్చించనుంది. శ్రీశైలం నుంచి ఆగస్టు చివరి వరకు తాగు, సాగు నీటి అవసరాలకు 16 టీఎంసీలను కేటాయించాలంటూ ఏపీ.. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు ఇండెంట్‌ పెట్టింది. రెండు రాష్ట్రాల ఇండెంట్‌ లపై తమ అభిప్రాయాలను తెలపాలని బోర్డు ఇరు రాష్ట్రాలను కోరింది. మొత్తానికి మరోసారి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సాగుతున్న జల జగడం ఎటు దారి దారితీస్తుందో చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..