కంటోన్మెంట్ సివిల్ ఏరియాలను జీహెచ్ఎంసీ లో విలీనంపై కీలక అడుగు పడింది. విలీనంపై కేంద్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేయడంపై విధివిధానాలను రూపొందించేందుకు కమిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. రక్షణ శాఖ, రాష్ట్ర మున్సిపల్ సెక్రటరీ సహా 8 మందితో కమిటీ ఏర్పాటు చేసింది. సివిల్ ప్రాంతం, స్థిర, చర ఆస్తులు, ఉద్యోగుల బదలాయింపు సహా అన్ని అంశాలపై కమిటీ అధ్యయనం చేయనుంది. ఇప్పటికే కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో విలీనానికి అభ్యంతరం లేదని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. దేశంలో ఉన్న కంటోన్మెంట్లతో అతిపెద్దది సికింద్రాబాద్‌లోనే ఉన్నది. బేగంపేట విమానాశ్రయం కారణంగా, ఆర్మీ ఆంక్షలతో కంటోన్మెంట్ పరిధిలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదు. ఎస్సీబీ వద్ద కూడా తగినన్ని నిధులు లేక.. రోడ్ల విస్తరణ, మౌళిక సదుపాయాల కల్పనపై పెద్దగా దృష్టి సారించలేదు.
ఈ క్రమంలో దేశంలో ఉన్న కంటోన్మెంట్ బోర్డులను సమీపంలోని స్థానిక సంస్థల్లో విలీనం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు తమ అభిప్రాయం తెలియజేయాలని లేఖలు రాసింది. మధ్యప్రదేశ్‌లోని కంటోన్మెంట్ ఇప్పటికే దగ్గరలోని మున్సిపాలిటీలో కలిసిపోగా.. తెలంగాణ ప్రభుత్వం కూడా ఎస్సీబీని తమ ఆధీనంలోకి తీసుకోవడానికి సుముఖంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో కమిటీని ఏర్పాటు చేయడం గమనార్హం.
జీహెచ్ఎంసీలో ఎస్సీబీ విలీనం జరిగితే దాదాపు 3వేల ఎకరాల కంటోన్మెంట్ ల్యాండ్ బల్దియా పరం అవుతుంది. జంటనగరాల్లోని నడిబొడ్డున ఉండటంతో మార్కెట్ విలువ కూడా వేల కోట్ల రూపాయల్లోనే ఉంటుందని అధికారులు అంటున్నారు. ఎస్సీబీ అధికారిక లెక్కల ప్రకారం కంటోన్మెంట్ బోర్డు 40 చదరపు కిలోమీటర్ల వైశాల్యం ఉంది. ఎస్సీబీ ట్రాన్స్‌ఫర్ ల్యాండ్‌లో జీహెచ్ఎంసీ ఫ్లైవోర్లు, స్కైవేలు, ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు, ట్రాఫిక్ జంక్షన్లు, ఇతర మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి ఆటంకాలు ఉండవు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..