
తెలంగాణ ఇంజినీరింగ్ విద్యార్థుల ఎదరుచూపులకు ఎట్టకేలకు తెరపడింది. తొలి విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు లిస్ట్‌ను ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. తమకు ఎక్కడ సీటు వస్తుందోనని విద్యార్థులు ఉత్కంఠతో ఎదురుచూశారు. మొత్తం 83,054 సీట్లు అందుబాటులో ఉండగా.. ఫస్ట్ ఫేజ్‌లో 77,561 సీట్లు కేటాయించారు. 16,793 మంది విద్యార్థులకు సీట్లు రాలేదు. ఈడబ్ల్యుఎస్ కోటా కింది 6083 సీట్లను కేటాయించారు. ఇంకా 5493 సీట్లు ఖాళీగా ఉన్నాయి. పలు కాలేజీలు 100శాతం అడ్మిషన్లను సాధించాయి. 6 యూనివర్సిటీలు, 76 ప్రైవేట్ కాలేజీలు 100 శాతం అడ్మిషన్లను పొందాయి. ఎంపికైన విద్యార్థులు ఈ నెల 22లోపు కాలేజీలో రిపోర్ట్ చేయాలని ఉన్నత విద్యామండలి సూచించింది. రెండో దశ కౌన్సిలింగ్ జూలై 25 నుంచి ప్రారంభం కానుంది. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఏ కాలేజీలో సీటు వచ్చిందో తెలుసుకోవచ్చు. సీటు గురించి తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి..
కాగా ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ప్రక్రియ జూన్ 28న ప్రారంభమైంది. 95,256 మంది విద్యార్థులు డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కు హాజరయ్యారు. అందులో సుమారు 94వేల మంది నచ్చిన కాలేజీల్లో సీట్ కోసం వెబ్‌ఆప్షన్స్ పెట్టుకున్నారు. అప్పటి నుంచి ఏ కాలేజీలో సీటు వస్తుందోననే టెన్షన్ విద్యార్థుల్లో నెలకొంది. తాజాగా ప్రభుత్వం లిస్ట్ విడుదల చేయడంతో ఆ టెన్షన్ తీరింది. ఈ సారి ఫైస్ట్ టైమ్ మాక్ అలాట్‌మెంట్ విధానాన్ని ఉన్నత విద్యామండలి ప్రవేశపెట్టింది. ఈ విధానం ద్వారా నచ్చిన కాలేజీలో సీటు రాకపోతే.. తొలివిడత సీట్ల కేటాయింపుకు ముందే విద్యార్థులు వెబ్ ఆప్షన్స్ మార్పు చేసుకునే వీలును కల్పించారు. జూలై 12న ఈ విధానంలో 77వేల 154మంది విద్యార్థులకు సీట్లు కేటాయించారు. అయితే అందులో 44వేలకు పైగా విద్యార్థులు తమకు నచ్చిన సీటు రాలేదని మళ్లీ కొత్త ఆప్షన్లు పెట్టుకున్నారు.
మరోవైపు మేనేజ్‌మెంట్ కోటా సీట్ల అడ్మిషన్లకు షెడ్యూల్ సైతం ఇప్పటికే రిలీజ్ అయ్యింది. జూలై 19నుంచి ఈ అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయి. అగస్టు 10 వరకు మేనేజ్‌మెంట్ కోటా సీట్లు భర్తీ చేసుకునే అవకాశం ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..