Nalgonda District: నల్లగొండ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. నాంపల్లి మండలం( Nampally Mandal) కేతేపల్లి(Kethepally)లో రామాలయం వద్ద ఇనుప రథాన్ని తీసే క్రమంలో అపశృతి జరిగింది. రథానికి విద్యుత్ తీగలు తగలడంతో.. విద్యుత్ పాపై ముగ్గురు స్పాట్‌లోనే మృతిచెందారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా మారింది. ఘటనపై అధికారులు అప్రమత్తమయ్యారు. తీవ్రంగా గాయపడినవారిని ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్య చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. చనిపోయినవారిని కేతేపల్లి గ్రామానికి చెందిన రాజాబోయిన యాదయ్య (42), పొగాకు మొనయ్య (43), మక్కపల్లికి చెందిన కారు డ్రైవర్ దాసరి అంజి (20) గా గుర్తించారు. దుర్ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
గ్రామంలో ఇటీవల రాములోరి ఉత్సవాలు నిర్వహించారు. ఉత్సవాల అనంతరం స్వామి వారి ఊరేగింపు చేసే రథం ఆలయ సమీపంలో ఉండగా.. ఆ రథాన్ని ఆలయంలోకి తరలిస్తున్నారు. ఈ క్రమంలో పైన విద్యుత్ వైర్లు తగిలి.. ఈ దుర్ఘటన జరిగింది.