Telangana: బెట్టింగ్ వేసి ఉద్దరించినవాళ్లు ఎవరూ లేరు.. ఇతనిలా బలైపోయినవాళ్లు తప్ప

ఓవర్ నైట్ అమాంతం డబ్బులు వచ్చేయాలనే ఆరాటం... ఈ రోజు డబ్బు పోతే.. రేపు అంతకు డబుల్ కొల్లగొట్టాలనే పిచ్చితనం.. వెరసి.. బెట్టింగ్ యువత ప్రాణాలను లాగేసుకుంటుంది.

Telangana: బెట్టింగ్ వేసి ఉద్దరించినవాళ్లు ఎవరూ లేరు.. ఇతనిలా బలైపోయినవాళ్లు తప్ప
Betting Leads To Suicide
Follow us
Ram Naramaneni

|

Updated on: May 16, 2022 | 12:37 PM

మందు తాగినా.. లిక్కర్ తాగినా.. మత్తు పదార్థాలకు బానిసైనా ఆయా వ్యక్తుల జీవితం మాత్రమే నాశనం అవుతుంది. కానీ ఈ బెట్టింగ్స్ వల్ల కుటుంబాలకు.. కుటుంబాలే నాశనం అవుతాయి. కష్టపడకుండా.. ఉన్నపలంగా డబ్బులు వచ్చేయాలన్నే అత్యాశే.. ఈ బెట్టింగ్స్ వేసేవారి పాలిట శాపంగా మారుతుంది. ఈ రోజు పోయిన డబ్బు సంపాదించాలని.. దానికి డబుల్ నెక్ట్స్ డే వేస్తారు. అది పోతే అప్పు తెచ్చి ఇంకా వేస్తారు. ఆ డబ్బు పోతే.. తెలిసినవారి బంగారం తాకట్టు పెట్టి మళ్లీ వేస్తారు. ఇలా ఇది నిరంతర ప్రక్రియగా సాగుతుంది. ఏదో ఒక రోజు అప్పు మించిన భారం అవుతుంది. అప్పుడు ఈ బెట్టింగ్ .. ఇతర నేరాలకు కూడా దారితీస్తుంది. బెట్టింగ్ కారణంగా అయిన అప్పులు తీర్చేందుకు కొందరు దొంగతనాలు చేస్తారు. ఇంకొందరు.. హత్యలు చేసిన సందర్భాలు కూడా మనం చూశాం.. ఇక ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలైతే కోకొల్లలు.  తాజాగా  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో సాయి కృష్ణ అనే యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య పాల్పడ్డాడు. గత కొంతకాలంగా ఇతడు ఆన్ లైన్ ఐపీఎల్ బెట్టింగులు ఆడుతున్నాడు. ముంబై ఇండియన్స్ అంటే విపరీతమైన అభిమానం పెంచుకున్న అతడు.. ముంబై ఆడే ప్రతి మ్యాచ్‌లో.. ఆ టీమ్ గెలుస్తుందని బెట్టు కట్టేవాడు. అయితే వరుస ఓటములతో చివరి స్థానానికి దిగజారింది ముంబై ఇండియన్స్. దీంతో బెట్టింగులలో బాగా డబ్బు లాస్ అయ్యాడు. ఈ క్రమంలో భారీగా అప్పులయ్యాయి. అప్పులు ఇచ్చినవారి నుంచి రోజురోజుకు ఒత్తిడి పెరిగిపోతుంది. దీంతో ఏం చేయాలో అర్థం కాక తనువు చాలించాడు. ఉన్నత చదువులు చదివి కూడా ఈ దిక్కుమాలిన బెట్టింగ్ వల్ల జీవితాన్ని అర్థాంతరంగా ముగించాడు. బెట్టింగ్ వేసేవాళ్లు గుర్తు పెట్టుకోండి.. మీరు, మీ కుటుంబాలు బాగుండాలంటే ఈ బెట్టింగ్స్ ఉచ్చులో చిక్కుకోకండి. ఏమీ చేతకాకపోతే ఇంట్లోనే ఖాళీగా కూర్చోండి.. అమ్మానాన్నలే 3 పూటలు తిండి పెడతారు.. కానీ ఇలా వారికి కడుపు కోత మాత్రం మిగల్చకండి.