AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: లైసెన్స్ కావాలంటే.. ఏఐని మెప్పించాల్సిందే.. ఇకపై టెస్ట్ పాస్ అవ్వడం ఈజీ కాదు భయ్యా..

తెలంగాణలో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడం ఇకపై అంత సులువు కాదు.. డ్రైవింగ్ టెస్టుల్లో రికమండేషన్లు, పైరవీలకు పూర్తిగా చెక్ పెట్టేందుకు రవాణా శాఖ సరికొత్త టెక్నాలజీని రంగంలోకి దించుతోంది. ఇకపై మానవ ప్రమేయం లేకుండా.. పక్కాగా ఏఐ నిఘా నీడలోనే డ్రైవింగ్ పరీక్షలు జరగనున్నాయి. తొలి దశలో ఏయే ప్రాంతాల్లో ఈ విధానం రాబోతుంది? నిబంధనలు ఎంత కఠినంగా మారనున్నాయి? అనేది తెలుసుకుందాం..

Telangana: లైసెన్స్ కావాలంటే.. ఏఐని మెప్పించాల్సిందే.. ఇకపై టెస్ట్ పాస్ అవ్వడం ఈజీ కాదు భయ్యా..
Telangana Driving Test Ai Tracks
Yellender Reddy Ramasagram
| Edited By: |

Updated on: Sep 29, 2026 | 6:33 PM

Share

తెలంగాణ రవాణా శాఖ కీలక సంస్కరణలకు శ్రీకారం చుడుతుంది. డ్రైవింగ్ లైసెన్స్ జారీ ప్రక్రియను మరింత పారదర్శకంగా మార్చడానికి, అర్హులైన వారికే లైసెన్స్‌లు అందేలా చూసేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వీడియో అనలిటిక్స్ టెక్నాలజీని రంగంలోకి దించుతుంది. పరీక్ష విధానంలో మానవ ప్రమేయాన్ని తగ్గించి, రోడ్డు ప్రమాదాలను నివారించడమే లక్ష్యంగా టెస్ట్ ట్రాక్‌లను ఆధునీకరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ ఆధునీకరణ సన్నాహకాల్లో భాగంగా రవాణా శాఖ జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి కొండాపూర్, నాగోల్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లను మంగళవారం సందర్శించారు. ప్రస్తుతమున్న ట్రాక్‌ల సామర్థ్యం, ఏఐ కెమెరాల ఏర్పాటుకు గల అవకాశాలు, మౌలిక వసతుల కల్పనపై క్షేత్రస్థాయిలో సమగ్ర సమీక్ష నిర్వహించారు.

రోడ్డు భద్రతను పెంపొందించాలంటే డ్రైవింగ్ నైపుణ్య పరీక్షలు అత్యంత కఠినంగా, పారదర్శకంగా ఉండాలని అధికారులు స్పష్టం చేశారు. లైసెన్సుల మంజూరులో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా సాంకేతికతను జోడించడమే దీని ప్రధాన ఉద్దేశమని వెల్లడించారు. ఇప్పటికే ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ విధానాన్ని విజయవంతంగా అమలు చేస్తున్న ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌ల కమిటీ సభ్యులు పర్యటించారు. అక్కడి అధునాతన సాంకేతికతలు, ఫలితాలు, ఎదురవుతున్న సవాళ్లను సమగ్రంగా అధ్యయనం చేసిన కమిటీ.. త్వరలోనే ప్రభుత్వానికి నివేదికను సమర్పించనుంది.

తొలి దశలో 6 ట్రాక్‌ల ఎంపిక

అధ్యయన కమిటీ నివేదిక ఆధారంగా రవాణా శాఖ ప్రైవేట్ భాగస్వామ్యంతో ట్రాక్‌లను అత్యాధునికంగా తీర్చిదిద్దనుంది.

తొలి దశ అమలు: హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని 5 ప్రధాన డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లతో పాటు కరీంనగర్ ఆర్టీఓ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లో ఈ ఏఐ వ్యవస్థను అమలు చేయనున్నారు.

పనితీరు: టెస్ట్ ట్రాక్‌ల వెంబడి హై-రిజల్యూషన్ ఏఐ నిఘా కెమెరాలు, సెన్సార్లు ఏర్పాటు చేస్తారు. వాహనం నడిపే సమయంలో డ్రైవర్ రివర్స్ తీయడం, 8 ఆకారం, H ట్రాక్‌లలో డ్రైవింగ్ తీరు, ట్రాఫిక్ నిబంధనల పాటించడం వంటి అన్ని అంశాలను ఏఐ అల్గారిథమ్స్ సెకన్ల వ్యవధిలో విశ్లేషిస్తాయి.

ఫలితం: మానవ జోక్యం లేకుండా నేరుగా సాఫ్ట్‌వేర్ ద్వారానే ఉత్తీర్ణత లేదా ఫెయిల్ వివరాలు నమోదవుతాయి.

ఈ అధునాతన విధానం పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తే నైపుణ్యం ఉన్న డ్రైవర్లు మాత్రమే రోడ్లపైకి వస్తారని, దీనివల్ల రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గుతాయని రవాణా శాఖ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

Follow Us