
తెలంగాణ రాష్ట్రం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అంతర్జాతీయ కార్యక్రమం తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమం హైదరాబాద్ వేదికగా అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రపంచ దృష్టిని ఆకర్షించడం ఈ సమ్మిట్ లక్ష్యంగా ప్రభుత్వం భారీ ఏర్పాటు చేసింది. హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడమే ప్రధాన లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచ ప్రఖ్యాత నాయకులు, పారిశ్రామిక దిగ్గజాలు, అంతర్జాతీయ ఐటీ సంస్థల పేర్లను నగరంలోని ప్రముఖ రహదారులకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం ప్రస్తుతం రాజకీయ, దౌత్య, వ్యాపార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
హైదరాబాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయం గుండా వెళ్ళే ప్రధాన రహదారికి డోనాల్డ్ ట్రంప్ అవెన్యూ అని పేరు పెట్టనున్నారు. ఇది ప్రపంచంలోనే తొలిసారిగా అమెరికా వెలుపల ఒక అధ్యక్షుడిని సత్కరిస్తున్నారని అధికారులు భావిస్తున్నారు. మరో ప్రధాన రహదారికి గూగుల్ స్ట్రీట్ అని పేరు పెట్టనున్నారు. అమెరికా వెలుపల గూగుల్ అతిపెద్ద క్యాంపస్ హైదరాబాద్‌లో రాబోతోంది. ఈ క్యాంపస్ సమీపంలోని రహదారికి ఆ పేరు పెట్టనున్నట్టుగా తెలుస్తోంది. మైక్రోసాఫ్ట్ రోడ్ విప్రో జంక్షన్ వంటి ఇతర ప్రపంచ పేర్లు కూడా పరిగణించబడుతున్నాయి.
అలాగే, నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డును రావిరియాలా వద్ద ప్రతిపాదిత ఫ్యూచర్ సిటీకి అనుసంధానించే 100 మీటర్ల గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డుకు పద్మ భూషణ్ రతన్ టాటా పేరు పెట్టాలని నిర్ణయించారు. రావిరియాలా ఇంటర్‌చేంజ్‌కు ఇప్పటికే టాటా ఇంటర్‌చేంజ్ అని పేరు పెట్టారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..