Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. పచ్చి బాలింత అన్న కనికరం లేకుండా నిర్ధాక్షిణంగా ప్రవర్తించింది 102 వైద్య సిబ్బంది. బురదమయంగా ఉన్న ఆ గ్రామ రహదారిపై వాహనం వెళ్లే పరిస్థితి లేదంటూ మూడు రోజుల బాలింతను నడిరోడ్డుపైనే దింపి వెళ్లిపోయారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో వెలుగు చూసింది.
సారపాక సమీపంలోని శ్రీరాంపురం ఎస్టీ కాలనీకి చెందిన సోడే పార్వతి.. మూడు రోజుల క్రితం భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. సెప్టెంబర్ 27న ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసి అమ్మఒడి వాహనంలో ఇంటికి పంపించారు వైద్యులు. అయితే ఆ వాహనం గ్రామానికి వెళ్లేందుకు రోడ్డు సరిగా లేకపోవడంతో డ్రైవర్ శ్రీరాంపురం రహదారిపై దించేశాడు. దీంతో పార్వతి చంటిబిడ్డను చేతులతో పట్టుకుని రెండు కిలోమీటర్ల దూరం నడిచుకుంటూ ఇంటికి చేరుకుంది. గ్రామానికి సరైన రహదారి సౌకర్యం లేక ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పది రోజుల క్రితం ఇదే గ్రా మానికి చెందిన ఓ మహిళ పాముకాటుకు గురి కాగా, వాహన సౌకర్యం లేక మోసుకుంటూ ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో మరణించింది. ఇప్పటికైనా ప్రభుత్వం తమ గ్రామానికి రోడ్డు వేయాలని స్థానికులు వేడుకుంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..