
తెలంగాణలోని విద్యార్థులు, తల్లిదండ్రులకు బిగ్ అలెర్ట్. శుక్రవారం, జూలై 10న రాష్ట్రవ్యాప్తంగా కేజీ నుంచి పీజీ వరకు అన్ని విద్యాసంస్థల మూతబడనున్నాయి. ఎందుకంటే రాష్ట్రవ్యాప్తంగా స్కూల్‌ల బంద్‌కు వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. విద్యారంగంలో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందంటూ SFI, AISF, PDSU, AIDSO తదితర సంఘాలు ఈ బంద్‌ను ప్రకటించాయి. బంద్ పిలుపు నేపథ్యంలో గురువారం హైదరాబాద్‌లోని వై జంక్షన్ నుంచి నారాయణగూడ చౌరస్తా వరకు విద్యార్థి నేతలు భారీ ప్రదర్శన నిర్వహించి, విద్యాసంస్థల మూసివేతకు సహకరించాలని కోరారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా కనీసం విద్యాశాఖ మంత్రిని కూడా నియమించలేదని విద్యార్థి సంఘాల నేతలు మండిపడ్డారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాల్సింది పోయి, ఏకంగా 23 వేల ప్రభుత్వ పాఠశాలలను మూసివేయాలని ప్రభుత్వం చూస్తోందని వారు ఆరోపించారు. మౌలిక వసతులు, కంప్యూటర్ ల్యాబ్‌లు లేకుండానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫిన్‌లాండ్ విద్య అంటూ ప్రభుత్వం ప్రగల్భాలు పలుకుతోందని.. సొంత భవనాలు లేక గురుకులాలు, విద్యాసంస్థలు అద్దె ఇళ్లలోనే నడుస్తున్నాయని నేతలు ధ్వజమెత్తారు.
మరోవైపు గత ఆరేళ్లుగా సుమారు రూ.10,814 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను ప్రభుత్వం విడుదల చేయడం లేదని, దీనివల్ల విద్యార్థులకు సర్టిఫికెట్లు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. జీవో నెంబర్ 7, 8, 9లను తీసుకొచ్చి ఫీజుల పథకాన్ని ఎత్తివేయడానికి కుట్రలు చేస్తున్నారని, కార్పొరేట్ ఫీజుల దోపిడీని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో విద్యావ్యవస్థను కాపాడుకునేందుకు శుక్రవారం జరిగే రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌ను విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని విద్యార్థి సంఘాల నేతలు పిలుపునిచ్చారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.