Telangana Municipolls: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు యథాతధం.. క్లారిటీ ఇచ్చిన రాష్ట్ర ఎన్నికల సంఘం

|

Apr 21, 2021 | 2:22 PM

వైరస్‌ పంజా విసురుతోంది. ఊపిరాడనీయకుండా చేస్తోంది. నెలాఖరుదాకా తెలంగాణలో నైట్‌కర్ఫ్యూ అమల్లో ఉంది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు యథాతధంగా జరగనున్నట్లు ప్రభుత్వం తెలిపింది

Telangana Municipolls: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు యథాతధం.. క్లారిటీ ఇచ్చిన రాష్ట్ర ఎన్నికల సంఘం
Telangana Muncipal Elections
Follow us on

వైరస్‌ పంజా విసురుతోంది. ఊపిరాడనీయకుండా చేస్తోంది. నెలాఖరుదాకా తెలంగాణలో నైట్‌కర్ఫ్యూ అమల్లో ఉంది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు యథాతధంగా జరగనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ నెల 30న ఎన్నికల నిర్వహణకు ఇబ్బందులు లేవని ప్రభుత్వం వెల్లడించింది. కొవిడ్ జాగ్రత్తలతో ఎన్నికలు నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తామని ఎస్‌ఈసీకి అధికారులు తెలిపారు. ఇప్పటికే ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వానికి ఎస్‌ఈసీ లేఖ రాసింది. ఈ నెల 30న వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లకు ఐదు మున్సిపాలిటీలకు పోలింగ్ జరగనుంది.

సెకండ్‌వేవ్‌లో కొత్త సవాళ్లు విసురుతోంది కరోనా మహమ్మారి. జనాన్ని కొంతైనా కట్టడి చేసేందుకు తెలంగాణలో రాత్రి 9నుంచి ఉదయం 6దాకా రాత్రి పూట కర్ఫ్యూ అమలవుతోంది. ఇలాంటి టైంలో వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు ఐదు మున్సిపాలిటీల ఎన్నికలు అవసరమా అన్న ప్రశ్న తెరపైకొస్తోంది.

రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తుంటే మరోవైపు ఈ నెల 30న రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల ఎన్నికలకు ఈసీ సిద్ధమైంది. అయితే తెలంగాణలో నైట్ కర్ఫ్యూ అమల్లోకి రావటంతో.. పురపోరు జరుగుతుందా లేదా అనే చర్చ మొదలైంది. కోవిడ్ నేపథ్యంలో ఎన్నికలు వాయిదా వేయాలని ఇప్పటికే కొంతమంది కోర్టుని ఆశ్రయించారు. అయితే, ఈ దశలో ఎన్నికలు ఆపమని ఆదేశాలివ్వలేమని హైకోర్టు చెప్పడంతో కొంతమేర అడ్డంకి తొలగిపోయింది.

స్వయానా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కోవిడ్‌ లక్షణాలతో విశ్రాంతి తీసుకుంటున్నారు. దీంతో పురపాలక ఎన్నికల్లో ప్రచార జోష్‌ తగ్గింది. నాయకులు సభలు, రోడ్‌షోల జోలికెళ్లటం లేదు. అయితే, ప్రచారం అనివార్యం కావటంతో.. ఏదో రూపంలో వైరస్‌ వ్యాప్తికి ఎన్నికలు కారణమవుతాయనే భయమైతే అందరిలో ఉంది.

ఎంత వైరస్‌ భయమున్నా ఎన్నికలన్నాక పార్టీలు కాళ్లు చేతులు కట్టుకుని కూర్చుంటాయనుకోవడం అత్యాశే. చేసింది చెప్పుకోకపోతే, ఓటర్ల ముంగిట్లోకి వెళ్లకపోతే ఎలాగన్న అభిప్రాయంతోనే నేతలు, అభ్యర్థులుంటారు. ఓ పక్క ప్రభుత్వ కార్యాలయాలకు, చివరికి ఎన్నికల కమిషన్‌ ఆఫీస్‌కి వెళ్లాలన్న కోవిడ్‌ నేపథ్యంలో అనేక నిబంధనలు పెడుతున్నారు. ఇలాంటి విపత్కర సమయంలో ఎన్నికలు అవసరమా అన్న ప్రశ్న ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.

కాంగ్రెస్, టీజేఏస్ ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతున్నాయి. ప్రజల ప్రాణాల కంటే ఎన్నికలు ముఖ్యమా అని ప్రశ్నిస్తున్నాయి. సాగర్ ఎన్నికల ప్రచారంతో చాలామంది కరోనా బారినపడ్డారు. అందుకే ఎన్నికలు వాయిదావేస్తే మంచిదంటున్నాయి విపక్షాలు. ఓటమి భయంతోనే టీఆర్‌ఎస్‌ ఇంత హడావుడిగా ఎన్నికలు పెట్టిందంటూ ఆరోపిస్తున్నారు ప్రతిపక్ష పార్టీల నేతలు.

విపక్షపార్టీలు వ్యతిరేకిస్తున్నా.. ఎన్నికల నిర్వహణకే అధికారపార్టీ మొగ్గుచూపుతోంది. అభ్యర్థులను ప్రకటిస్తూ ప్రచారంలో మాత్రం జాగ్రత్తలు తీసుకుంటోంది. ఎలాగూ ప్రక్రియ ప్రారంభమైంది కాబట్టి.. ఈ వారం పదిరోజులు జాగ్రత్తలు తీసుకుంటే ఓ పనైపోతుందనుకుంటోంది అధికారపక్షం.

కరోనా కాలంలో ఎన్నికల నిర్వహణపై సామాన్యుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కరోనా ప్రబలుతుందనే భయం కొందరిలో ఉన్నా.. ఎన్నికలు వాయిదాపడితే అభివృద్ధి కుంటుపడుతుందన్న అభిప్రాయం కూడా బలంగానే ఉంది. ఎప్పుడైనా అనివార్యమే కాబట్టి ఎన్నికలు జరిపితేనే మంచిదన్న అభిప్రాయంతో కొందరున్నారు. అయితే సామాన్య ప్రజలకు మాత్రం సవాలక్ష ఆంక్షలుపెడుతూ.. ప్రచారాల్లో నేతలకు పగ్గాలెందుకు వేయలేకపోతున్నారన్నది సామాన్యుడి ప్రశ్న.

Read Also…  Oxygen Cylinders Looted: కరోనా కలకలం.. ఆక్సిజన్ సిలిండర్ల లూటీ.. రంగంలోకి దిగిన కలెక్టర్, పోలీసులు