Telangana: రాఖీ రోజు తెలంగాణ ఆర్టీసీకి రికార్డు కలెక్షన్లు.. ఒక్క రోజే ఏకంగా

ఆర్టీసీకి ఈ స్థాయిలో ఆదాయం సమకూరడం పట్ల సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్‌ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ అధికారులకు, ఉద్యోగులకు ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు. అంతేకాకుండా ఆర్టీసీ సంస్థను ప్రజలు మరింత ఆదరించాలని, ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు...

Telangana: రాఖీ రోజు తెలంగాణ ఆర్టీసీకి రికార్డు కలెక్షన్లు.. ఒక్క రోజే ఏకంగా
TSRTC

Updated on: Sep 01, 2023 | 1:30 PM

గురువారం దేశ ప్రజలంతా రాఖీ పండగను ఎంతో ఘనంగా జరుపుకున్నారు. తమ తోబుట్టువులకు అక్కా చెల్లెల్లు రాఖీ కట్టి తమ ప్రేమను చాటుకున్నారు. అన్న,దమ్ములు ఎంత దూరాన ఉన్నా వెళ్లి అనుబంధాలకు విలువనిచ్చారు. ఈ క్రమంలోనే రాఖీ పండగ రోజు తెలంగాణ ఆర్టీసీకి కాసులు కురిశాయి. రాఖీలు కట్టడానికి వెళ్లిన మహిళలు పెద్ద ఎత్తున ఆర్టీసీని ఆశ్రయించడంతో గురువారం తెలంగాణ ఆర్టీసీ కలెక్షన్లు భారీగా వచ్చాయి.

రాఖీ పౌర్ణమి ఒక్కరోజే ఆర్టీసీకి ఏకంగా రూ. 20.65 కోట్ల ఆదాయం రావడం విశేషం. ఆర్టీసీకి ఈ స్థాయిలో ఆదాయం సమకూరడం పట్ల సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్‌ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ అధికారులకు, ఉద్యోగులకు ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు. అంతేకాకుండా ఆర్టీసీ సంస్థను ప్రజలు మరింత ఆదరించాలని, ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు ఆర్టీసీ బస్సులో ప్రయాణించేందుకు వీలుగా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని గోవర్థన్‌ చెప్పుకొచ్చారు.

ఇందులో భాగంగానే ప్రయాణికుల కోసం మరిన్ని రాయితీలతో కూడిన పథకాలను ప్రవేశపెడుతున్నామని తెలిపారు. ఈ క్రమంలోనే కార్గో, బస్సు సర్వీసుల్లోనూ అనేక రాయితీలు అందిస్తూ, ప్రజల ఆదరణ చూరగొంటున్నట్లు చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా ఆర్టీసీకి అన్ని రకాలుగా సహాయాన్ని అందిస్తున్నారని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

ఇక ఈ సందర్భంగా సంస్థ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ ప్రజలందరూ ఆర్టీసీని ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. రాఖీ పండగ రోజు రూ. 20.65 కోట్ల ఆదాయం రావడానికి కృషి చేసిన ప్రతీఒక్కరికీ పేరుపేరునా అభినందనలు తెలిపారు. మరీ ముఖ్యంగా ఆర్టీసీ వైస్‌ ఛైర్మన్‌, మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్‌తో పాటు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు, ఉద్యోగులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.

ఇదిలా ఉంటే ప్రయాణికులను ఆకర్షించే క్రమంలో తెలంగాణ ఆర్టీసీ ఇప్పటికే ఎన్నో రకాల చర్యలను చేపట్టిన విషయం తెలిసిందే. కార్గో నుంచి వివాహాది శుభకార్యక్రమాల వరకు, స్లీపర్ బస్సులు మొదలు బస్సు పాసుల్లో రకరకాల రాయితీలతో ప్రయాణికులను ఆకట్టుకుంటోంది. సజ్జనర్ వినూత్న ఆలోచనలతో ఆర్టీసీ లాభాల బాట పట్టింది.

20 డిపోల్లో 100 శాతానికి పైగా ఓఆర్..

ఆక్యూపెన్సీ రేషియా(ఓఆర్) విషయానికి వస్తే.. ఉమ్మడి నల్లగొండ జిల్లా గత ఏడాది రికార్డును పునరావృతం చేసింది. 2022లో రాఖీ పండుగ నాడు 101.01 ఓఆర్ సాధించగా.. ఈ సారి 104.68 శాతం రికార్డు ఓఆర్ నమోదు చేసింది. ఆ జిల్లా పరిధిలోని 7 డిపోల్లో నార్కెట్ పల్లి మినహా మిగతా డిపోలు 100 శాతానికిపైగా ఓఆర్ సాధించాయి. నల్లగొండ తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ రాఖీ పౌర్ణమికి 97.05 శాతం ఓఆర్ నమోదైంది. ఆ జిల్లాలో 9 డిపోలు ఉండగా.. 6 డిపోలు 100కిపైగా ఓఆర్ సాధించడం విశేషం. అలాగే, ఉమ్మడి మెదక్, మహబూబ్ నగర్, కరీంనగర్ జిల్లాల్లో 90 శాతానికి పైగా ఓఆర్ నమోదైంది.

రాఖీ పౌర్ణమి నాడు రాష్ట్రంలోని 20 డిపోల్లో ఓఆర్ 100 శాతానికి పైగా దాటింది. ఆయా డిపోల్లో బస్సులన్నీ ప్రయాణికులతో నిండిపోయాయి. హుజురాబాద్, నల్లగొండ, భూపాలపల్లి, హుస్నాబాద్, పరకాల, కల్వకుర్తి, తొర్రూర్, మహబుబాబాద్, మిర్యాలగూడ, దేవరకొండ, యాదగిరిగుట్ట, గజ్వేల్-ప్రజ్ఞాపూర్, కోదాడ, నర్సంపేట, సూర్యాపేట, దుబ్బాక, జనగామ, సిద్దిపేట, గోదావరిఖని, షాద్ నగర్ డిపోలు 100 శాతానికిపైగా ఓఆర్ సాధించాయి. రాష్ట్రంలో రికార్డుస్థాయిలో అత్యధికంగా ఒక కిలోమీటర్ కు రూ.65.94ను వరంగల్-1 డిపో, రూ.65.64ను భూపాలపల్లి డిపో సాధించింది. ఈ రెండు కూడా సంస్థ చరిత్రలోనూ ఎర్నింగ్స్ పర్ కిలోమీటర్ (ఈపీకే) ఆల్ టైం రికార్డు గమనార్హం.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..