TSRTC: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల డెడ్ లైన్.. ఇవాళ జీతాలు ఇవ్వకపోతే రేపటి నుంచి సమ్మె

ఈనెలకు సంబంధించిన జీతాలు 6వ తేదీలోగా చెల్లించకుంటే సమ్మెబాట పడతామని తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు సర్కారుకు డెడ్ లైన్ పెట్టారు.

TSRTC: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల డెడ్ లైన్..  ఇవాళ జీతాలు ఇవ్వకపోతే రేపటి నుంచి సమ్మె
TSRTC

Updated on: Aug 06, 2021 | 11:31 AM

TSRTC employees strike warning: ఇవాళ ఈనెలకు సంబంధించిన జీతాలు చెల్లించకుంటే సమ్మెబాట పడతామని తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు సర్కారుకు డెడ్ లైన్ పెట్టారు. ఇప్పటికే పరిష్కరించాల్సి ఉన్న తమ మొత్తం 59 సమస్యలను ప్రభుత్వానికి, సంస్థ యాజమాన్యానికి నివేదించామని, కానీ ఇప్పటివరకూ స్పందన రాలేదని ఉద్యోగులు చెప్పారు. తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్టేషన్ కార్పొరేషన్ జాయింట్ యాక్షన్ కమిటీ (ఆర్‌టిసి జేఏసీ) ఈ మేరకు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండి) సునీల్ శర్మకు ఒక లేఖ రాసింది.

ఈ నెల జీతాలను ఇవాళ (ఆగస్టు 6) పంపిణీ చేయాలని లేదా రాష్ట్రవ్యాప్తంగా.. ముందుగా ప్రకటించినట్లుగా ఆగస్టు 7న సమ్మెకు దిగుతామని జేఏసీ ఎండికి రాసిన లేఖలో పేర్కొంది. తమ సమస్యలు పరిష్కరించాలంటూ మెమోరాండం సమర్పించి ఇప్పటికే 25 రోజులు గడిచినప్పటికీ, తమకు ఇంతవరకు ఎలాంటి స్పందన రాలేదని జేఏసీ సదరు లేఖలో స్పష్టం చేసింది. ఉద్యోగుల కష్టాలను తీర్చేందుకు కనీసం ఇప్పటి వరకూ ఎలాంటి అధికారులను కూడా నియమించలేదని జేఏసీ తన ఆవేదనను వ్యక్తం చేసింది.

కాగా, మొన్న(ఆగష్టు 3) జరిగిన జేఏసీ జనరల్ బాడీ సమావేశంలో, ప్రభుత్వం తమ వేతనాలను ఆగస్టు 6 లోపు విడుదల చేయకపోతే సమ్మె చేస్తామని నాయకులు తీర్మానం చేశారు. యాజమాన్యం పట్టించుకోకపోతే విధులను బహిష్కరించాలని నిర్ణయించుకున్నారు. దీనితో పాటు, ఆగస్టు 15 లోపు శాసనసభ్యులందరికీ తమ కష్టాలను వివరించేలా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు.

ఇలా ఉండగా, తమ డిమాండ్ల సాధన, సమస్యల పరిష్కారానికి టీఎస్ఆర్టీసీకి చెందిన 10 యూనియన్లు కలిసి గతనెలలో జేఏసీగా ఏర్పడ్డ సంగతి తెలిసిందే. తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ (టీఎంయూ) మినహా అన్ని యూనియన్లు జేఏసీలో చేరాయి.

Read also: Officers Fight: విశాఖ దేవాదాయశాఖ అధికారుల మధ్య కొట్లాట, ఆఫీస్‌లో డిప్యూటీ కమిషనర్‌పై ఇసుక, మట్టి విసిరిన అసిస్టెంట్ కమిషనర్ శాంతి