Telangana: రేషన్ కార్డులు ఉన్నవారికి తెలంగాణ సర్కార్ అదిరిపోయే గుడ్ న్యూస్

తెలంగాణలో రేషన్ వ్యవస్థ కొత్త మలుపు తిరగబోతోంది. పేదల భోజనపు ప్లేట్‌లో మార్పు తెచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. వచ్చే ఏడాది నుంచి రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం మాత్రమే కాదు.. ఆ బియ్యానికి తోడు ఐదు రకాల నిత్యావసర సరుకులు కూడా అందించేలా ప్రణాళికలను సిద్ధం చేస్తుంది. పేదలకు నాణ్యమైన ఆహారం అందించే విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

Telangana: రేషన్ కార్డులు ఉన్నవారికి తెలంగాణ సర్కార్ అదిరిపోయే గుడ్ న్యూస్
Telangana Ration System Overhaul

Edited By:

Updated on: Jan 23, 2026 | 12:04 PM

రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పబోతుంది. త్వరలో సన్న బియ్యంతో పాటు రేషన్ సరుకులను కూడా అందించాలని ప్లాన్ చేస్తుంది. ఈ విషయాన్ని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా తెలియజేశారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో వ్యవసాయ రంగం మరోసారి తన సత్తా చాటిందన్నారు. వానాకాలం సీజన్‌లో 70.82 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్య సేకరణతో గత 25 ఏళ్లలో ఎన్నడూ లేని రికార్డు నమోదైందన్నారు. ఇప్పటివరకు ఉన్న గరిష్ట సేకరణ గణాంకాలన్నింటినీ ఈ ఖరీఫ్ సీజన్ వెనక్కి నెట్టేసిందని.. రైతుకు భరోసా, పంటకు గిట్టుబాటు అనే విధానాలే ఈ ఫలితానికి కారణమని మంత్రి పేర్కొన్నారు.

మొత్తం ధాన్యంలో సగానికి పైగా.. అంటే 38.37 లక్షల మెట్రిక్ టన్నులు సన్న రకాలే ఉన్నాయన్నారు. సాంబ మసూరి, తెలంగాణ మసూరి వంటి నాణ్యమైన రకాల సాగుకు ప్రభుత్వం మరింత ప్రోత్సాహం ఇస్తూ.. రైతులకు మేలు జాతి విత్తనాలు అందించి, సన్న పంట సాగును విస్తరించాలన్నదే లక్ష్యమని మంత్రి తెలిపారు. ధాన్యం ఎక్కువైతే నిల్వే అసలు సవాల్ అని.. అందుకే రాష్ట్రంలో గోదాముల సామర్థ్యాన్ని పెంచేందుకు ఆధునిక సాంకేతికతను తీసుకొస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.

ప్రస్తుతం ఉన్న 29 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యాన్ని మించి.. కేంద్ర సహకారం, ప్రైవేటు భాగస్వామ్యంతో కొత్త గోదాములు నిర్మించనున్నారు. అదే సమయంలో తెలంగాణ బియ్యానికి మార్కెట్ విస్తరించేలా… ఇతర రాష్ట్రాలు, విదేశాలకు ఎగుమతి చేసే మిల్లులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్టు తెలిపారు. కానీ నిబంధనలు అతిక్రమించే మిల్లుల విషయంలో మాత్రం ప్రభుత్వం ఏమాత్రం సడలింపు ఇవ్వదని స్పష్టం చేశారు. డిఫాల్టర్ మిల్లులకు వచ్చే యాసంగిలో ధాన్యం కేటాయింపు ఉండదని మంత్రి కఠినంగా హెచ్చరించారు.

ఈ ఖరీఫ్‌లో రాష్ట్రవ్యాప్తంగా 14.21 లక్షల మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి. వారి ఖాతాల్లో నేరుగా రూ.17,018 కోట్లను జమ చేసినట్టు తెలిపారు. సన్న బియ్యం పండించిన రైతులకు అదనంగా క్వింటాకు రూ.500 చొప్పున ఇప్పటివరకు రూ.1,425 కోట్ల బోనస్ అందించామన్నారు. ధాన్యం సేకరణలో నిజామాబాద్ జిల్లా అగ్రస్థానంలో నిలవగా.. నల్గొండ, కామారెడ్డి జిల్లాలు తర్వాతి వరుసలో ఉన్నాయన్నారు. సంక్రాంతి వేళ రైతన్న ముఖంలో కనిపించే చిరునవ్వే ఈ ప్రభుత్వానికి అసలైన విజయమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.