ఎన్నికల దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయనుకుంటున్న తరుణం.. ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్దంగా వుండేలా వ్యూహాలకు పదును పెడుతున్న రాజకీయ పార్టీలు.. సగటు ఓటరు కుతూహలంగా రాజకీయా పరిణామాలను పరికిస్తున్న తరుణంలో ఉన్నట్లుండి తెలంగాణ రాజకీయాల్లో పెద్ద కుదుపు. కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి కుదుపులు సహజమే అనుకుంటూ సరిపెట్టుకుంటున్న క్షణంలో భారత రాష్ట్ర సమితిలో సంభవించిన పరిణామం ఆసక్తి రేపుతోంది. మంత్రి మల్లారెడ్డికి వ్యతిరేకంగా గళమెత్తిన అయిదుగురు ఎమ్మెల్యేల విషయంలో అధిష్టానం ధోరణి ఏంటనే విషయం ఇంకా తేలనప్పటికీ.. గులాబీ బాస్ కనుసన్నల్లోనే రాజకీయం చేసే నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వున్న బీఆర్ఎస్ పార్టీలో ఏకంగా అయిదుగురు ఎమ్మెల్యేలు ఓ మంత్రిపై నిప్పులు చెరిగారు. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో అంతా తానై వ్యవహరిస్తూ మిగిలిన బీఆర్ఎస్ క్యాడర్‌ని పట్టించుకోవడం లేదంటూ అయిదుగురు ఎమ్మెల్యేలు మైనంపల్లి హనుమంతరావు, వివేకానంద్, అరికెపూడి గాంధీ, సుభాష్ రెడ్డి, మాధవరం కృష్ణారావు గళమెత్తారు. నిజానికి బీఆర్ఎస్ (గతంలో టీఆర్ఎస్ పార్టీ)లో మొదట్నించి ఇలాంటి విషయాలను అంతర్గతంగా అధినేత కేసీఆర్ దగ్గరో, అది వీలు కాకుండా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటు కేటీఆర్ దగ్గరో విన్నవించుకోవడం.. నిర్ణయం ఆయనకే వదిలేయడం జరిగేది. కానీ తొలిసారి అలా చేయకుండా.. ఏకంగా మీడియా ముందుకొచ్చారు ఈ జీ-5 ఎమ్మెల్యేలు. ఆల్‌రెడీ అధినేతకు చెప్పేందుకు ప్రయత్నించి, అది వీలు కాకపోవడంతో రహస్యంగా భేటీ అయ్యారా ? ఆ భేటీ గురించి కొందరు మీడియా లీక్ చేయడంతో అనివార్యంగా మీడియా ముందుకొచ్చారా అన్నది తేలాల్సి వుంది. డిసెంబర్ 19న పొద్దున్నే మైనంపల్లి హనుమంతరావు ఇంట్లో అయిదుగురు ఎమ్మెల్యేలు భేటీ అయిన విషంయ మీడియాలో బ్రేకింగ్ న్యూస్ రావడంతో విషయం వెలుగు చూసినా అటు అధినేత కేసీఆర్ గానీ, ఇటు వర్కింగ్ ప్రెసిడెంటు కేటీఆర్ గానీ నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించలేదు. అయిదుగురు ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడిన తరువాత కూడా ఎవరూ స్పందించలేదు. ఒక దశలో కేటీఆర్‌తో ఈ జీ-5 ఎమ్మెల్యేలు భేటీ అవుతారని ప్రచారం జరిగినా.. ఆయన్నుంచి ఎలాంటి పిలుపూ రాలేదని తేలిపోయింది. సో.. ఈ అయిదుగురు మీడియాకు ఎక్కినా అధినేత సీరియస్‌గా తీసుకోలేదని అర్థమవుతోంది. ఒకవేల కేసీఆర్ గనక ఈ అయిదుగురిని సీరియస్‌గా తీసుకుంటే వారిని తానే స్వయంగా పిలిపించుకోవడమో లేక కేటీఆర్ లాంటి వారిని జీ-5 ఎమ్మెల్యేలతో మాట్లాడమని ఆదేశించడమో జరిగేది.. అలాంటిదేమీ డిసెంబర్ 19 సాయంత్రం వరకు కనిపించలేదు. సో.. ఈ ఎమ్మెల్యేల వాదనను అధినేత అంత సీరియస్‌గా తీసుకోలేదనిపిస్తోంది.
జీ-5 రచ్చ బీఆర్ఎస్ పార్టీలో ఓ కొత్త చర్చకు తెరలేపగా.. అటు కాంగ్రెస్ పార్టీలో అయితే గత పది రోజులుగా అంతర్గత అసంతృప్తితో రచ్చ కొనసాగుతోంది. ఏ క్షణమైతే టీపీసీసీ కమిటీతోపాటు పొలిటికల్ అఫైర్స్ కమిటీలను ప్రకటించారో ఆ క్షణమే తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రచ్చ షురూవైంది. అది రోజురోజుకూ పెరిగిపోతూనే వుంది కానీ తగ్గుముఖం పట్టే సంకేతాలు కనిపించడం లేదు. ఈ క్రమంలోనే తెలంగాణలో జరుగుతున్న గొడవలపై కాంగ్రెస్ హైకమాండ్ దృష్టి పెట్టింది. ఢిల్లీ కాంగ్రెస్ నేతలు ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నారు. తాజా పరిణామాలపై ఇంఛార్జీ కార్యదర్శులు హైకమాండ్‌కు నివేదికలిచ్చారు. వివాదం మరింత ముదరకుండా చూడాలని ఏఐసీసీ పెద్దలు సీనియర్లకు ఫోన్లు చేశారు. పార్టీలో సమస్యలు ఉంటే ఢిల్లీకి వచ్చి చెప్పాలని సీనియర్లకు ఏఐసీసీ సూచించింది. మరోవైపు రేపు సమావేశం కావాలని సీనియర్లు నిర్ణయించారు. హైకమాండ్ రంగంలోకి దిగడంతో డిసెంబర్ 20న నిర్వహించ తలపెట్టిన సమావేశంపై ఉత్కంఠ నెలకొంది. టీపీసీసీ కమిటీల ఏర్పాటుతో కాంగ్రెస్ పార్టీలో చెలరేగిన చిచ్చు మలుపులు తిరుగుతుంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి టార్గెట్‌గా సీనియర్లు ఏకతాటిపైకి వచ్చారు. సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క నివాసంలో సమావేశమైన సీనియర్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మధుయాష్కి, జగ్గారెడ్డి, దామోదర రాజనరసింహ.. రేవంత్ రెడ్డిపై గళమెత్తారు. టీడీపీ నుంచి వలసవచ్చిన నేతలతో అసలైన కాంగ్రెస్ వాదులకు అన్యాయం జరుగుతుందని ఉమ్మడిగా గళం వినిపించారు. తాము ఒరిజనల్ కాంగ్రెస్ అని.. పార్టీ కాపాడుకునేందుకు సేవ్ కాంగ్రెస్ కార్యాక్రమం చేపడతామని తెలిపారు.
తెలంగాణ కాంగ్రెస్‌లో అసంతృప్తి గళం తార స్థాయికి చేరిన వేళ పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. సీఎల్పీ నేత, పీసీసీ మాజీ అధ్యక్షుడితో సహా పలువురు సీనియర్ నాయకులు రేవంత్‌పై చేసిన విమర్శలను ఆయన వర్గీయులు తిప్పికొట్టారు. కాంగ్రెస్ పార్టీని, రేవంత్‌రెడ్డిని బలహీనపర్చే కుట్ర జరుగుతోందన్నారు ఆయన వర్గీయలు అంటున్నారు. నిట్టనిలువునా చీలిపోయిన తెలంగాణ కాంగ్రెస్‌లో అంతకంతకూ తీవ్రమైన సంక్షోభంపై పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. ఏఐసీసీ సెక్రటరీ నదీమ్‌కు ఫోన్ చేశారు ప్రియాంక గాంధీ. జరుగుతున్న పరిణామాలను అడిగి తెలుసుకున్నారామె. కొత్త కమిటీల్లో అన్యాయం జరిగిందని భావిస్తున్న సీనియర్లతో త్వరలో ప్రియాంకగాంధీ భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏఐసీసీ సెక్రటరీ నదీమ్ ఇప్పటికే ఓ రిపోర్ట్‌ను మాణిక్కం ఠాకూర్‌కి అందించారు. దీంతో రంగంలోకి దిగిన హైకమాండ్.. అసంతృప్త నేతలతో వెంటనే భేటీ కావాలని పార్టీ కార్యదర్శులను ఆదేశించినట్టు తెలుస్తోంది. లేటెస్ట్‌గా ప్రియాంక గాంధీ.. నదీమ్‌కు కాల్ చేసి అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ కాంగ్రెస్‌పై ప్రియాంకా వధేరా దృష్టి సారించినట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఆమె స్వయంగా ఫోను చేసి వివరాలు కనుక్కోవడం చూస్తే టీపీసీసీ వ్యవహారాలలో త్వరలోనే ప్రియాంక నేరుగా జోక్యం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరోవైపు సీనియర్ నేతలు చేసిన కామెంట్స్‌కు.. రేవంత్ వర్గం నేతలు కౌంటర్ ఇచ్చారు. టీడీపీ బ్యాగ్రౌండ్ ఉన్న 12 మంది నేతలు పీసీసీ పదవులకు రాజీనామా చేశారు. తాము పదవుల కోసం ఆశపడటం లేదని.. పార్టీ బాగు కోసం కృషి చేస్తామని తెలిపారు. తాము కాంగ్రెస్‌లో చేరి నాలుగేళ్లు దాటిందని.. ఇంకా వలసనేతలు, టీడీపీ అని అనడటం ఏమిటని సీనియర్ నేతలకు కౌంటర్ ఇచ్చారు. దీన్ని బట్టి చూస్తుంటే సీనియర్లతో అమీతుమీ తేల్చుకునేందుకే రేవంత్ రెడ్డి సిద్దమవుతున్నట్లు భావించాలి. తనకు వ్యతిరేకంగా గళమెత్తిన నేతలను ప్రసన్నం చేసుకుని, కలుపుకుని పోవాల్సిన పార్టీ పెద్ద.. తన అనుంగు వర్గంతో వారిపై ఎదురు దాడి చేయించడం చూస్తే తానెవరికీ తలొగ్గేది లేదని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు అర్థమవుతోంది. ఈక్రమంలో డిసెంబర్ 20 టీపీసీసీ భేటీకి ఎవరు హాజరవుతారు? ఎవరు దూరంగా వుంటారనేది ఆసక్తి రేపుతోంది. మొత్తానికి అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఒక్కసారిగా విచిత్ర పరిస్థితిలో పడిపోయాయి. ఈ పరిణామాలను గమనిస్తున్న బీజేపీ అధినాయకత్వం ఈ రెండు పార్టీల్లో అసంతృప్తిగా వున్న వారికి గాలమేయాల్సిందిగా స్థానిక నేతలకు ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది. ఈ అన్ని పరిణామాల నేపథ్యంలో తెలంగాణ రాజకీయం వచ్చే పక్షం రోజులు ఆసక్తికర సంఘటనలతో ఆద్యంతం రక్తి కట్టే సంకేతాలు కనిపిస్తున్నాయి.