Revanth Reddy: వరంగల్ యూత్ లీడర్‌ను పరామర్శించిన రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ నేతలపై ఫైర్.. దిష్టి బొమ్మలను దహనం చేయాలంటూ..

|

Feb 21, 2023 | 2:54 PM

గుర్తు తెలియని ఐదారుగురు యువకులు తోట పవన్‌ను పబ్లిక్‌కు దూరంగా తీసుకెళ్లి విచక్షణారహితంగా కొట్టారు. దీంతో అతను..

Revanth Reddy: వరంగల్ యూత్ లీడర్‌ను పరామర్శించిన రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ నేతలపై ఫైర్.. దిష్టి బొమ్మలను దహనం చేయాలంటూ..
Revanth Reddy Visits Thota Pawan
Follow us on

వరంగల్‌లో గుర్తుతెలియని వ్యక్తుల దాడిలో గాయపడ్డ యూత్‌ కాంగ్రెస్‌ నేత తోట పవన్‌ను తెలంగాణ పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల ప్రోద్భలంతోనే కాంగ్రెస్‌ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు.  బీఆర్‌ఎస్‌ నేతల అక్రమాలను వెలుగులోకి తెచ్చినందుకే తోట పవన్‌పై ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్‌ అనుచరులు విచక్షణారహితంగా దాడి చేశారని కూడా రేవంత్‌ ఆరోపించారు. నిందితులపై చర్యలు తీసుకోకుంటే కాంగ్రెస్‌ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. ఎమ్మెల్యేపై హత్యాయత్నం కేసు పెట్టి.. అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. దాడులు చేసింది ఎవరో తెలిసినా ఇప్పటి వరకూ నిందితులను పోలీసులు అరెస్టు చేయలేదని మండిపడ్డారు. దాడి దృశ్యాలు చిత్రీకరించి తమ వాళ్లకు పంపి బెదిస్తున్నారని, దాడిపై వరంగల్ సీపీని కలుస్తానని చెప్పారు. రాష్ట్ర డీజీపీ ఇక్కడికి రావాలన్నారు. ఈ ఘటనకు నిరసనగా అన్ని మండల కేంద్రాల్లో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మలు దహనం చేయాలని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులకు పిలుపిచ్చారు.

అయితే హనుమకొండలో సోమవారం రాత్రి కాంగ్రెస్‌ యువజన నాయకుడు తోట పవన్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి చేపట్టిన హాథ్‌ సే హాథ్‌ జోడో యాత్రలో భాగంగా బహిరంగసభ ముగిసిన కొన్ని నిమిషాలకే సభావేదికకు సమీప దూరంలోనే ఈ దాడి జరిగింది. ఫలితంగా తోట పవన్ ముక్కు, కుడి కన్ను భాగంలో బలమైన గాయాలయ్యాయి. వీపుపై కూడా వాతలు తేలాయి.

కాగా, హనుమకొండలోని ఏనుగులగడ్డ దగ్గర ప్రైవేటు భవనంపై యూత్‌ కాంగ్రెస్‌ నాయకుడు తోట పవన్‌, మరికొంత మంది కార్యకర్తలు వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌ మీద ఛార్జిషీటు పేరుతో ఫ్లెక్సీ కట్టారు. ఈ కారణంగానే గుర్తు తెలియని ఐదారుగురు యువకులు తోట పవన్‌ను పబ్లిక్‌కు దూరంగా తీసుకెళ్లి విచక్షణారహితంగా కొట్టారు. దీంతో అతను అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. రక్తపుమడుగులో ఉన్న పవన్‌ను స్థానికులు గమనించి హుటాహుటిన సమీపంలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్‌ నాయకులు, శ్రేణులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రికి చేరుకున్నారు. డీసీసీ నేత నాయిని రాజేందర్‌రెడ్డి ఆస్పత్రి వద్ద మాట్లాడుతూ పవన్‌పై బీఆర్‌ఎస్‌ కార్యకర్తలే దాడి చేశారని ఆరోపించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..