
ఏపీ రాజకీయాల్ని షేక్ చేస్తున్న ఆ పార్టీ… ఇప్పుడు తెలంగాణలోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. మిత్రపక్షాలతో కలిసి మున్సిపల్ పోరుకు సై అన్నప్పటికీ, అధినేత ఇంకా రంగంలోకి దిగలేదు. అయినా, ప్రత్యర్థి పార్టీల నుంచి ముప్పేట దాడి మొదలైపోయింది.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో… జనసేన పార్టీ హాట్ టాపిక్‌గా మారింది. ఓవైపు అధికారపక్షం.. మరోవైపు ప్రతిపక్షాలు… పోటాపోటీగా సిద్ధమవుతున్న వేళ.. జనసేన సైతం పురపోరులోకి ఎంట్రీ ఇవ్వడం ఆసక్తి రేపుతోంది. ఇప్పుడు ప్రచారానికి పవన్ వస్తున్నారనే ముచ్చట.. మరింత హీటు పుట్టిస్తోంది. తెలంగాణలోనూ జెండా పాతేందుకు ప్రయత్నిస్తోన్న ఆ పార్టీ… అందులో భాగంగానే… మున్సిపల్ ఎన్నికల్లో పలుచోట్ల అభ్యర్థులను నిలబెట్టింది. వారి పక్షాన ప్రచారం చేసేందుకు.. పవన్ కూడా రెండ్రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్నారు. అంతేకాదు, తన మిత్రపక్షం బీజేపీ అభ్యర్థులకు మద్దతుగానూ పవన్ ప్రచారం చేయనున్నారు. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. పవన్‌ను కలిసి ఆహ్వానం పలికారు.
తెలంగాణలోకి మరోసారి ఎంట్రీ ఇస్తున్న పవన్.. రాష్ట్ర శాఖ నాయకులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. ఈ నెల 7, 8 తేదీల్లో జనసేన పార్టీ అభ్యర్థులకు, అలాగే బీజేపీ పార్టీకి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని పవన్ కల్యాణ్ తెలిపారు.
ఈ నెల 11 న తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, తెలంగాణ జనసేన నాయకులతో సమావేశమై, వారికి దిశానిర్దేశం చేసిన జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు. 7,8 తేదీల్లో జనసేన పార్టీ అభ్యర్థులకు, అలాగే బీజేపీ పార్టీకి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని… pic.twitter.com/yJr8qzCdek
— JanaSena Party (@JanaSenaParty) February 5, 2026
అయితే, జనసేనాని రీ ఎంట్రీపై ప్రత్యర్థులు విమర్శలు సంధిస్తున్నారు. పవన్ రాకను వద్దనడం లేదంటూనే.. గతంలో తెలంగాణ ఏర్పాటు చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని పీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్ డిమాండ్ చేస్తున్నారు. పీసీసీ చీఫ్ అలాగన్నారనుకుంటే.. పవన్ కల్యాణ్ ఆగమనంపై సీనియర్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరోలా స్పందించారు. అసలు పవన్ ఎందుకొస్తున్నారు..? ఒకవేళ బీజేపీ కోసం వస్తే.. ఆ పార్టీ తెలంగాణలో ఎక్కడుందన్నట్టుగా ఆయన వ్యాఖ్యానించారు.
తెలంగాణ రాజకీయాల్లోకి పవన్ ఎంట్రీ కొత్తకాదు. ఆయన ప్రచారమూ కొత్తకాదు. ఇటీవల కొండగట్టు అంజన్న సన్నిధిలో.. టీటీడీ నిధులతో భారీ అభివృద్ధి కార్యక్రమాలకూ శ్రీకారం చుట్టారు. కానీ ఇప్పుడు వస్తున్న ఎంట్రీ ప్రత్యేకమైంది కాబట్టే.. పవన్‌పై తమదైన స్టయిల్‌లో ప్రత్యర్థులు విరుచుకుపడుతున్నట్టు తెలుస్తోంది. మరి, పవన్ ప్రచారం ఎవరికి ఎంత మైనస్ అవుతుందో? ఎవరికెంత ప్లస్ అవుతుందో చూడాలి..!
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..