AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Municipal Elections: తెలంగాణలో మూగబోయిన మైకులు.. ముగిసిన మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వం!

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. కాసేపటి క్రితమే రాష్ట్రవ్యాప్తంగా మైకులు అన్ని మూగబోయాయి. దీంతో పోలింగ్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఇక జనవరి 11న రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 116 మున్సిపాల్టీలు, 7 కార్పొరేషన్లకు పోలింగ్ జరగనుండగా 52 లక్షల మంది ఓటర్లు 12,993 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు.

Municipal Elections: తెలంగాణలో మూగబోయిన మైకులు.. ముగిసిన మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వం!
Telangana Municipal Elections
Anand T
|

Updated on: Feb 09, 2026 | 4:32 PM

Share

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. కొద్దిరోజులుగా గల్లీల్లో వినిపించిన మైకుల హోరు, పార్టీల ప్రచార జోరుకు తెరపడింది. పోలింగ్‌కు కౌంట్‌డౌన్ షురూ అయింది. ఈ నెల 11న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటలవరకు 116 మున్సిపాల్టీలు, 7 కార్పొరేషన్లకు పోలింగ్‌ జరుగనుంది. 13న కౌంటింగ్‌ నిర్వహిస్తారు. మొత్తం 2,996 వార్డుల్లో జరుగుతున్న ఈ ఎన్నికల్లో 12,993 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 52 లక్షల మందిపైగా ఓటర్లు వీరి భవితవ్యాన్ని తేల్చనున్నారు. ఇందులో మహిళా ఓటర్లు 26 లక్షల మంది, పురుష ఓటర్లు 25 లక్షల మంది ఉన్నారు.

ఎన్నికలను అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం పటిష్టమైన చర్యలు చేపట్టింది. ఈసారి రాష్ట్ర ఎన్నికల సంఘం అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 8వేల 203 పోలింగ్ కేంద్రాల్లో 100 శాతం వెబ్‌కాస్టింగ్ సౌకర్యాన్ని కల్పించింది. ఈ ఎన్నికలు బ్యాలెట్ పేపర్ల ద్వారానే జరుగుతుండటంతో, సుమారు 16వేల 301 బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేసి ఆయా కేంద్రాలకు పంపిణీ చేశారు. ఓటింగ్ ముగిసిన అనంతరం బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించి, అక్కడ 24 గంటల పాటు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయనున్నారు.

మరోవైపు 25,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 1,900 సమస్యాత్మక, 1,400 అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి, అక్కడ సీసీటీవీ మానిటరింగ్‌తో పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు. ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మద్యం దుకాణాలను కూడా మూసివేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.