AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఆ ఐదుగురు ప్రభుత్వ అధికారులకు జీతాల్లో కోత.. వామ్మో ఆ చట్టం చాలా కఠినం!

ప్రభుత్వ ఉద్యోగులు విధుల్లో అలసత్వం వహిస్తే ఏమి జరుగుతుంది? ప్రజలకు కష్టాలు వస్తాయి. ప్రజలేమో ఒకవేళ ఉద్యోగుల పై ఫిర్యాదు చేస్తే తమ పని పూర్తికాకుండా ఆగిపోతుందేమో అనే భయంతో వారి అలసత్వాన్ని భరిస్తూ వస్తారు.

Telangana: ఆ ఐదుగురు ప్రభుత్వ అధికారులకు జీతాల్లో కోత.. వామ్మో ఆ చట్టం చాలా కఠినం!
Telangan Government
KVD Varma
|

Updated on: Feb 09, 2022 | 8:52 PM

Share

ప్రభుత్వ ఉద్యోగులు విధుల్లో అలసత్వం వహిస్తే ఏమి జరుగుతుంది? ప్రజలకు కష్టాలు వస్తాయి. ప్రజలేమో ఒకవేళ ఉద్యోగుల పై ఫిర్యాదు చేస్తే తమ పని పూర్తికాకుండా ఆగిపోతుందేమో అనే భయంతో వారి అలసత్వాన్ని భరిస్తూ వస్తారు. అయితే, తెలంగాణా(Telangana) సర్కారు మాత్రం ఉద్యోగులు విధుల్లో అలసత్వం వహిస్తే ఊరుకునే ప్రసక్తి లేదని అంటోంది. ఆ..ఊరుకోక ఏం చేస్తారులెండి. ఎదో పైకి అలా చెబుతారు. అంతే అని అనుకోకండి. ఎటువంటి పరిస్థితుల్లోనూ అలసత్వానికి అవకాశం ఉండకూడదని పదే పదే హెచ్చరించినా వినని ఉద్యోగులకు(Employees) గట్టిగా వారికీ అర్ధం అయ్యే భాషలోనే చెప్పడం మొదలు పెట్టింది తెలంగాణా ప్రభుత్వం. ఇంతకీ ఏం చేసిందో తెలుసా. పని విషయంలో అలసత్వం ప్రదర్శించి.. చెప్పిన సమయానికి ఆ పని పూర్తి చేయని ఉద్యోగులకు జీతంలో కట్ పెట్టింది. ఎదో నోటి మాటగా ఇది చెప్పడం కాదు. జీవో కూడా విడుదల చేసింది. అసలు ఆ ఉద్యోగులు చేసిన తప్పేంటి? ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమేమిటి? పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

TS బీపాస్ దరఖాస్తుల పరిశీలనలో అలసత్వం:

ప్రభుత్వ ఉద్యోగులు పౌరచట్టాలకు లోబడి ఉండటం అదేవిధంగా వారిలో జవాబుదారీతనం పెంచడం లక్ష్యంగా తెలంగాణా ప్రభుత్వం ప్రత్యేక చట్టం చేసింది. అధికారులలో అవినీతి పద్ధతులను తొలగించడం కోసం తెలంగాణ ప్రభుత్వం “తెలంగాణ మునిసిపాలిటీ చట్టం 2019” ను అమలులోకి తీసుకువచ్చింది. ఈ చట్టానికి అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం టిఎస్-బిపిఎఎస్‌ను ప్రవేశపెట్టింది. స్వీయ-ధృవీకరణ వ్యవస్థ ద్వారా ల్యాండ్ డెవలప్మెంట్ అలాగే భవనాల నిర్మాణ సమయంలో అవసరమైన వివిధ అనుమతులను ప్రాసెస్ చేయడానికి ఒకే సమగ్ర వేదికగా బీపీఎస్ కు రూపకల్పన చేసింది తెలంగాణా ప్రభుత్వం. అదేవిధంగా దీని నిబంధనల ప్రకారం ప్రజలకు నిర్ణీత కాలపరిమితిలో సేవలను అందించేలా ఏర్పాట్లు చేశారు.

అయితే ఇటీవల రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో సైట్ వెరిఫికేషన్ అధికారులు ఈ చట్టంలో రూపొందించిన నిబంధనలు అతిక్రమించినట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ప్రజలు పెట్టుకున్న ఆర్జీలను చట్టంలో చెప్పిన విధంగా సకాలంలో పరిష్కరించలేదనే విషయం తేలింది. దీంతో ఆ అధికారులపై చర్యలకు ఉపక్రమించింది తెలంగాణా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం. ఈ మేరకు సదరు అధికారులపై చర్యలు తీసుకుంటూ మేమో విడుదల చేసింది.

ఈ మెమోలో పేర్కొన్న ప్రకారం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో మొత్తం 58 బిల్డింగ్ లకు టీఎస్-బీపాస్ ద్వారా ఇవవలసిన అనుమతులను కొందరు వెరిఫికేషన్ అధికారులు పెండింగ్ లో పెట్టారు. సదరు ఆర్జీలను 42 రోజుల కు పైగా తొక్కి పెట్టారు. ఇది టీఎస్-బీపాస్ చట్టానికి, నిబంధనలకు వ్యతిరేకం. దీంతో అలసత్వానికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకున్నారు. సదరు అధికారుల జీతాల నుంచి 5 వేల రూపాయలను కోత విధించాల్సిందిగా సంబంధిత వర్గాలకు ఆదేశాలు జారీచేసింది ప్రభుత్వం. నర్సాపూర్ కు చెందిన మణి భూషణ్ పరిశీలనలో 19, కామారెడ్డికి చెందిన యశ్వంత్ రెడ్డి పరిశీలనలో 10, ఇబ్రహీంపట్నానికి చెందిన యాదయ్య వద్ద 10, ఖమ్మంకు చెందినా టీ సురేష్ వద్ద 10, మక్తల్ కు చెందిన ఎండీ షహరాజ్ అహ్మద్ వద్ద 9 దరఖాస్తులు రోజులు గడుస్తున్నప్పటికీ పెండింగ్ లో ఉన్నాయి. వీరి అలసత్వాన్ని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం వారి జీతాలలో కోతలు విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

తెలంగాణా కొత్త మున్సిపాలిటీ చట్టం ప్రకారం ఆకస్మిక ఆడిట్లను నిర్వహిస్తారు. ఈ సమయంలో నిబంధనలను ఉల్లంఘించిన పౌరులు లేదా అధికారులకు జరిమానా విధించవచ్చు. ఆ రకంగా ఈ ఐదుగురు అధికారులకు జీతాలలో కోత పడింది.

ఇవి కూడా చదవండి: Statue of Equality: మన సమాజంలో శాస్త్రం.. శస్త్రం రెండు ఉండాలి.. రామనగరిలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్..

Telangana Politics: ఎనిమిదేళ్లుగా ఏం చేశారు?.. తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాల్సి.. మోదీపై జీవన్ రెడ్డి ఫైర్..