Mla Shakeel Car Accident: జూబ్లీహిల్స్ కారు ప్రమాదం కేసు అనేక మలుపులు తిరుగుతోంది. అసలు ఏం జరుగుతుందో, నేరస్థులెవరో తెలియని అయోమయం నెలకొంది. పోలీసులు, తాజాగా ఇద్దరిని అరెస్టు చేసినా, వారే ఆ కారు నడిపారా? లేక ఇంకా ఎవర్నైనా తప్పించడానికి వీరిని అరెస్టు చేశారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కారు యాక్సిడెంట్ కేసులో తాజాగా ఇద్దరిని అరెస్టు చేశారు పోలీసులు. మీర్జా, అతని కుమారుడిని అరెస్టు చేసినట్టు వెల్లడించారు పోలీసులు. కానీ, అసలు కారులో ఎంతమంది ఉన్నారనేది ఇప్పటికీ మిస్టరీగానే మారింది. కాసేపు షకీల్ కుమారుడని, కాసేపు మీర్జా కుమారుడే ప్రమాదానికి కారణమంటున్నారు పోలీసులు. దీంతో బాధితులకు న్యాయం జరిగేనా అన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.
ఈ ప్రమాదం జరిగినప్పటి నుంచి ఎమ్మెల్యే షకీల్ చేసిన కామెంట్స్ అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. నిన్న రాత్రి, 8 గంటల 45 నిమిషాలకు ప్రమాదం జరిగింది. ఆ కారుపై ఎమ్మెల్యే స్టిక్కర్ చూసి, షకీల్‌కు ఫోన్ చేశారు పోలీసులు. గంటన్నర తర్వాత, ఆ కారు తనకు తెలిసిన దూరపు వాళ్లదని చెప్పాడు షకీల్.
ఇక్కడిదాకా ఎలా ఉన్నా, రాత్రి 12 గంటలకు మళ్లీ సీన్ మారింది. అది తన ఫ్రెండ్ కారని మాట మార్చారు ఎమ్మెల్యే షకీల్. అక్కడితో ఆగలేదు, ఇవాళ పొద్దున 10 గంటలకు మీర్జా ఇన్‌ఫ్రా పేరుతో, తన ఫ్రెండ్ కారు తీసుకున్నాడని చెప్పారు. ఆ తర్వాత మధ్యాహ్నం ఒంటిగంటకు, మీర్జాకు ఎమ్మల్యే స్టిక్కర్ ఇచ్చానని చెప్పుకొచ్చారు షకీల్.
మళ్లీ ఏమైందో ఏమో, సాయంత్రం 4 గంటలకు మీర్జా తన కజిన్ అని, ఆడియో రిలీజ్ చేశారు ఎమ్మెల్యే షకీల్. మీర్జా కొడుకుతో సహా, అతని కుటుంబం కార్లో ఉందన్నారు. ఈ మాటలు మార్చేపర్వం కొనసాగుతుండగానే, నాలుగున్నరకు మరో బ్రేకింగ్ న్యూస్ తెలిసింది. నిమ్స్ ఆస్పత్రి నుంచి కాజల్ మిస్సింగ్ కలకలం రేపింది. అయితే, బాధితులతో మాట్లాడుకోవాలని చెప్పానని షకీల్ చెప్పడం చర్చనీయాంశమైంది. అటు కాజల్ మిస్సింగ్‌పై కేసు నమోదు చేశారు పోలీసులు.
ఇవన్నీ చూస్తుంటే, ఇప్పుడు పోలీసులు అరెస్టు చేసిన మీర్జా, అతని కుమారుడే అసలు నిందితులా? లేక ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఎవర్నీ కాపాడటానికి ఎమ్మెల్యే ఇన్ని మాట్లు మార్చరనే చర్చ జరుగుతోంది. ఈ కేసులో విచారణ సజావుగా సాగుతుందా అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. వీటన్నిటి మధ్యలో కాజల్ మిస్సింగ్ మిస్టరీగా మారింది.
Also read: