తెలంగాణ ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటన ముగిసింది. పలు దిగ్గజ సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయని మంత్రి తెలిపారు. దావోస్ వేదికగా తెలంగాణ రాష్ట్రానికి 21వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు మంత్రి కేటీఆర్. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు కోసం నాలుగు రోజుల పర్యటన విజయవంతంగా కొనసాగిందన్నారు. దావోస్‌లో మొత్తం 52 వాణిజ్య సమావేశాలు, ఆరు రౌండ్ టేబుల్ సమావేశాలు, రెండు ప్యానల్ డిస్కషన్లలో పాల్గొన్నట్టు తెలిపారు. ప్రపంచంలోని పలు దిగ్గజ సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయని మంత్రి కేటీఆర్ చెప్పారు.
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ 16వేల కోట్ల పెట్టుబడితో హైదరాబాద్‌లో మరో మూడు డేటా కేంద్రాలు ఏర్పాటు చేస్తోందని తెలిపారు మంత్రి కేటీఆర్. అలాగే భారతీ ఎయిర్‌టెల్ గ్రూప్ దాదాపు 2వేల కోట్ల పెట్టుబడితో హైదరాబాద్‌లో భారీ హైపర్‌స్కేల్ డేటా సెంటర్‌ను నిర్మించనుందని వెల్లడించారు. ఇక ఫార్మా రంగానికి చెందిన యూరోఫిన్స్ సంస్థ జీనోమ్ వ్యాలీలో వెయ్యికోట్ల రూపాయలతో అత్యాధునిక లేబొరేటరీ క్యాంపస్‌ను ఏర్పాటు చేస్తోందన్నారు.
వీటితోపాటు ప్రఖ్యాతి గాంచిన పెప్సికో, పీఅండ్ జీ, అల్లాక్స్, అపోలో టైర్స్ లిమిటెడ్, వెబ్ పీటీ, ఇన్‌స్పైర్ బ్రాండ్స్ వంటి ఇతర అంతర్జాతీయ సంస్థలు కూడా 2వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు ప్రకటించినట్లు మంత్రి కేటీఆర్ చెప్పారు. కొత్త పెట్టుబడులకు సంబంధించిన సమావేశాలు సానుకూల ఫలితాలను ఇస్తాయని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఇంత పెద్దమొత్తంలో తెలంగాణకు పెట్టుబడులు రావడం హర్షించదగ్గ విషయమన్నారాయన.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..