Minister Harish Rao: ఎప్పుడూ కూల్‌గా ఉండే మంత్రి హరీశ్‌రావుకి కోపం వచ్చింది. మన ఊరు మన బడి కార్యక్రంలో అధికారులు ప్రవర్తించిన తీరుపట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
పిల్లలతో పూలు చల్లించడం పట్ల మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకోసారి ఇలాంటి పనులు మానేయాలని విద్యాశాఖ అధికారికి గట్టిగానే చెప్పడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం కుకునూర్ పల్లి గ్రామంలో మన ఊరు మన బడి కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రికి స్వాగతం పలకడానికి విద్యార్థులను ఏర్పాటు చేసి వారితో.. పూలు చల్లించారు. దీంతో జిల్లా విద్యాశాఖ అధికారి రమాకాంత్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి హరీష్ రావు. ఇక పై ఇలాంటివి మానేయాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు.
అసలే ఎండాకాలం కావడంతో ఎండలు మండిపోతున్నాయి. గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతులు నమోదవుతున్నాయి. బయటకు రావాలంటేనే జనాలు భయపడాల్సిన పరిస్థితి. ఇలాంటి సమయంలో పిల్లలను గంటల తరబడి ఎండలో నిలబెట్టి పూలు చల్లించడంతో మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి దగ్గర మంచి అభిప్రాయం సంపాదించాలనో.. ఇతర కారణాలతోనో.. కొంత మంది అధికారులు ఇలా అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తుంటారు. అందుకే ఇలాంటివి పునరావృత్తం కాకుడదనే ఉద్ధేశంతోనే మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.