తెలంగాణకు చెందిన యువకుడు ఉపాధీ కోసం దుబాయ్‌కు వెళ్తే.. యుద్ధంలో ప్రైవేట్ సైనికుడిగా చేర్చిపించి ఏజెంట్ మోసం చేశాడు. రష్యా – ఉక్రెయిన్ సరిహద్దులో నిత్యం బాంబులు, తుపాకుల మోతల మధ్య బిక్కు బిక్కుమంటూ భయంతో అల్లాడుతున్నాడు.
నారాయణపేట జిల్లా కేంద్రానికి చెందిన జహీర్, నాసీమా రెండో కుమారుడు సయ్యద్ మహ్మద్ సుఫియన్ ఉపాధి కోసం ఓ ఎజెంట్ ద్వారా దుబాయ్ వెళ్లారు. ఇంటర్ వరకు చదివిన సుఫియన్ 2021 నుంచి దుబాయ్ లోని ఓ హోట్ లో పనిచేస్తున్నాడు. అక్కడే ఫైసల్ ఖాన్ అలియాస్ బాబా అనే ఏజెంట్ పరిచయమయ్యాడు. ఇక్కడ పనిచేస్తే నెలకు రూ.30 వేలు మాత్రమే వస్తాయి.. అదే రష్యాలో సెక్యూరిటీ జాబ్ ఉంది. నెలకు రూ. లక్షకు పైగా సంపాదించవచ్చని ఆశ చూపాడు. సుఫియన్ తో పాటు అతని మిత్రులను నమ్మించి తనకు రూ.3లక్షల ఇవ్వాలని బేరం కుదుర్చుకున్నాడు. దీంతో కుమారుడు కోసం సుఫియన్ తల్లిదండ్రులు అప్పుచేసి మరి రూ.3లక్షల రూపాయలు పంపించారు. అయితే ఏజెంట్ బాబా సహయంతో గతేడాది డిసెంబర్ 18న రష్యాకు సుఫియాన్ వెళ్లాడు. అప్పుడే అసలు కథ మొదలైంది.
మాస్కోలోని ఒక మాల్ లో సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగం చేయాలంటూ రష్యన్ భాషలో ఉన్న లెటర్‌పై సుఫియన్‌తో సంతకం తీసుకున్నారు. అనంతరం అక్కడ సైనిక శిబిరంలోకి తీసుకెళ్లి తుపాకుల వాడకంపై శిక్షణ ఇచ్చారు. అయితే, ఇదంతా సెక్యూరిటీ ఉద్యోగంలో భాగంగా ట్రైనింగ్ అని నమ్మించారు. అనంతరం రష్యా-ఉక్రెయిన్ సరిహద్దులోకి చేర్చి విధులు నిర్వర్తించాలని చెప్పారు. దీంతో అనుమానం వచ్చిన అపాయింట్‌మెంట్ లెటర్‌లో ఎముందని ఆరా తీశాడు. దీంతో తనతో సంతకం చేయించుకున్న పత్రం ప్రైవేట్ ఆర్మీ ది వాగ్నర్ గ్రూప్ ది అని సుఫియాన్ ఆలస్యంగా తెలుసుకున్నాడు. ఒక ఏడాది కాలం కాంట్రక్ట్ కుదుర్చుకున్నట్లు సుఫియాన్ సంతకం చేశాడు. డిసెంబర్ 24, 2023 నుంచి కాంట్రాక్ట్ మొదలైనట్లు ఆలస్యంగా గుర్తించాడు.
కాంట్రాక్ట్ పత్రాలపై సంతకాలు, శిక్షణ పూర్తి కావడంతో సూఫియాన్ ను రష్యా-ఉక్రెయిన్ సరిహద్దుకు తరలించారు. అక్కడ నిత్యం బాంబులు, తుపాకుల మోత మధ్య బిక్కు బిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నాడు. తమను వీలైనంత త్వరగా ఇక్కడి నుంచి తీసుకెళ్లాలని కుటుంబ సభ్యులకు సమాచారం పంపుతున్నాడు. ఏజెంట్ బాబా చేతిలో మోసపోయి యుద్ధంలో చిక్కుకుపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సూఫియాన్ తో పాటు భారత దేశానికి చెందిన మరికొంత మంది సైతం బాధితులు ఉన్నారని తెలుస్తోంది.
ఉపాధి కోసం విదేశాలకు వెళ్తే మోసం చేసి యుద్ధంలో ఇరికించారని తల్లిదండ్రులు జహీర్, నాసీమా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీతం ఎక్కువ వస్తుందన్న ఆశతో రూ.3లక్షలు అప్పుచేసి మరి సుఫియాన్ కు పంపించామని… ఇలా జరుగుతుందని అనుకోలేదని కన్నీటిపర్యంతమవుతున్నారు. నెల క్రితం ఫోన్ చేసిన సుఫియాన్ ప్రస్తుతం కాంటాక్ట్ అవడం లేదని భయాందోళనలో ఉన్నారు. ఎక్కడ ఉన్నాడో.. ఎలా ఉన్నాడో అని కుటుంబ సభ్యులు మనోవేదనకు గురవుతున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని తమ కుమారుడిని తిరిగి భారత్ కు తీసుకురావాలని వేడుకుంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…