Telangana Lockdown extends : తెలంగాణలో ఈ నెలాఖరు (30 మే 2021) వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తూ కేసీఆర్ సర్కారు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో తదనుగుణంగా ఉత్తర్వులు విడుదల చేశారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్. లాక్ డౌన్ పొడిగింపు ఉత్తర్వులను పటిష్టంగా అమలుచేయుటకు తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమీషనర్లు, ఎస్. పి. లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయాలని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి పోలీసు ఉన్నతాధికారులకు జారీ చేసిన ఆదేశాలు మరింత కఠినంగా అమలు చేయాలని నిర్ణయించారు. హైదరాబాద్ తోపాటు అన్ని ప్రధాన నగరాలు, జిల్లా హెడ్ క్వార్టర్లు, ప్రధాన నగరాలలో లాక్ డౌన్ పటిష్టంగా అమలు చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణం చేసేవారికి ఈ- పాస్ విధానం ద్వారా సంబంధిత కమిషనర్లు, ఎస్.పిలు పాసులను జారీ చేస్తారని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పోలీస్ శాఖ తెలంగాణ ప్రజలకు చేసిన పలు సూచనలు ఇలా ఉన్నాయి :
* రాష్ట్రం లో వ్యవసాయ సంబంధిత కార్యకలాపాలు, ధాన్యం సేకరణ, రవాణా లపై ఏవిధమైన ఆంక్షలు లేవు.
* జాతీయ రహదారులపై రవాణా పై ఏవిధమైన ఆంక్షలు లేవు.
* ప్రధాన రంగంలో ఉన్న ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు తమ అక్రిడేషన్ కార్డులు కానీ, సంస్థాపరమైన గుర్తింపు కార్డులు తమవెంట ఉంచుకోవాలని స్పష్టం చేశారు.
* గ్రామాల్లో వ్యవసాయ సంబంధిత పనులు, ఉపాధిహామీ పనులను లాక్ డౌన్ నుండి మినహాయింపు.
* ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు వారి శాఖా పరమైన గుర్తింపు కార్డులుంటే సరిపోతుంది.
* రాష్ట్రం లో జరిగే వివాహాలకు ఇరువైపుల చెందిన 40 మంది మాత్రమే హాజరయ్యేవిధంగా చూడాలి.
* వివాహలకు తప్పనిసరిగా ముందస్తు అనుమతులు పొందాలి.
* మరణాలకు సంబంధించి కేవలం 20 మంది మాత్రమే హాజరు కావాలి.
* కరోనా వాక్సినేషన్ కు ఎవరైనా వెళ్లాల్సివస్తే వారి మొదటి డోస్ కు సంబంధించిన సమాచారం సెల్ ఫోన్ లో చూసి వారికి సడలింపు ఇవ్వాలి.
* నిత్యావసర వస్తువుల రవాణా సక్రమంగా జరిగేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.
* నిత్యావసర వస్తువుల రవాణా, ఇతర ఎమర్జెన్సీ సేవలకు సంబంధించి స్థానికంగా సమయాలను పేర్కొంటూ ప్రత్యేక పాసులను జారీ చేయాలి.
* ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై డిజాస్టర్ మేనేజ్ మెంట్ చట్టం తో పాటు ఐపీసీ ప్రకారం తగు కేసులు నమోదు చేయాలి.
Read also : Viral video : కాంచీపురంలో ఉత్తరాది వలస కార్మికులను విచక్షణారహితంగా చితకబాదిన యజమాని.. వైరల్‌గా మారిన వీడియో