
తెలంగాణలో స్థానిక ఎన్నికలు డైలీ సీరియల్ విధంగా మారింది. ఎన్నికలకు సంబంధించి ఒక అడుగు ముందుకు పడితే.. నాలుగు అడుగులు వెనకకు పడుతున్నాయి. ఈ క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ప్రజాపాలన వారోత్సవాలు పూర్తయిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్ తీర్మానించింది. రాష్ట్రంలో డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 9 వరకు ప్రజాపాలన వారోత్సవాలు నిర్వహించాలని కేబినెట్‌లో నిర్ణయించారు. ఈ వారోత్సవాలలో ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించడం, ప్రభుత్వ పథకాల అమలుపై అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉంది.
నిజానికి తెలంగాణలోని స్థానిక సంస్థల పదవీకాలం ఇప్పటికే ముగియడంతో ఎన్నికల నిర్వహణ అనివార్యంగా మారింది. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే రిజర్వేషన్ల పెంపు సరికాదంటూ హైకోర్టు ఆ నోటిఫికేషన్‌ను కొట్టేసింది. ఎన్నికల వేళ ఇచ్చిన హామీ మేరకు ఇటీవల ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్లను పెంచుతూ ఆర్డినెన్స్ జారీ చేసింది. దీనికి అనుగుణంగా ఎన్నికల సంఘం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే రిజర్వేషన్లు 50శాతానికి మించడానికి వీలు లేదంటూ హైకోర్టు వాటిని కొట్టేసింది.
హైకోర్టు నిర్ణయంతో స్థానిక ఎన్నికలు మరోసారి వాయిదా పడ్డాయి. మరోవైపు ఈ నెల 24లోగా ఎన్నికల నిర్వహణపై స్పష్టత ఇవ్వాలని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో కేబినెట్ డిసెంబర్ 9 తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించడం గమనార్హం. మరోవైపు గ్రామాల్లో ఇప్పటికే ఎన్నికల సందడి మొదలైంది. ఆశావాహులు ప్రజలను మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు. ప్రస్తుత కేబినెట్ నిర్ణయంతో డిసెంబర్‌లో స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల అవడం ఖాయమని తెలుస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..